కూటమి నేతల భూ కబ్జా స్కెచ్‌ | - | Sakshi
Sakshi News home page

కూటమి నేతల భూ కబ్జా స్కెచ్‌

Aug 20 2026 12:05 AM | Updated on Aug 20 2026 12:05 AM

నకిలీ వీలునామా, డెత్‌ సర్టిఫికెట్లతో 1.57 ఎకరాల కబ్జాకు యత్నం అడ్డుకుంటే చంపేస్తామంటూ అసలు యజమానులపై బెదిరింపులు అగ్రిమెంట్‌ ఉందంటూ రంగంలోకి జనసేన నేత సీపీ, పెందుర్తి పోలీసులను ఆశ్రయించిన బాధితులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నగరంలో భూ కబ్జాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్కు స్థలాలు, కొండలను కొల్లగొడుతున్న కబ్జాదారులు.. ఇప్పుడు ఎన్నారైలకు చెందిన విలువైన భూమిపైనా కన్నేశారు. ఎప్పుడో మృతి చెందిన వ్యక్తి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి.. ఏకంగా 1.57 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పెందుర్తి మండలం సౌభాగ్యరాయపురం (ఎస్‌ఆర్‌ పురం)లో చోటుచేసుకున్న ఈ ఘటనలో అధికార కూటమికి చెందిన నేతల పేర్లు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.

నకిలీ పత్రాలతో కబ్జాకు స్కెచ్‌

పెందుర్తి మండలం ఎస్‌ఆర్‌ పురంలోని సర్వే నంబర్‌ 109లో మొత్తం 24.54 ఎకరాల భూమి ఉంది. ఇందులో వేపగుంట దరి సేనాతి వానిపాలెంకు చెందిన గొడవర్తి నారాయణచార్యులు 1980లో కొంత భూమిని అన్నపూర్ణమ్మ, బి.సూర్యనారాయణరాజు, బి.రంగరాజులకు విక్రయించారు. అనంతరం వీరి నుంచి ఎనిమిది మంది ఆ భూమిని కొనుగోలు చేశారు. అయితే అడంగల్‌లో ఇంకా 1.57 ఎకరాల భూమి ఎన్నారైల పేరిట ఉన్నట్లు గుర్తించిన ‘బాబీ’ గ్యాంగ్‌.. దానిపై కన్నేసింది. ఈ భూమిని తమ పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు పక్కా ప్రణాళిక వేసింది. ఇందులో భాగంగా ఎప్పుడో మృతి చెందిన గొడవర్తి నారాయణచార్యులు బతికే ఉన్నట్లు చూపించే తప్పుడు రికార్డులు తొలుత సృష్టించింది. అనంతరం ఆయన 2009లో మృతి చెందినట్లు నకిలీ డెత్‌ సర్టిఫికెట్‌, దొంగ వీలునామా, నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాలు తయారు చేసింది. ఆకలి మహాలక్ష్మినాయుడు అనే వ్యక్తి సహకారంతో ఈ పత్రాలను సిద్ధం చేసి.. భూమిని తమ పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించుకునేందుకు ప్రయత్నించింది.

అమ్మకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు

నకిలీ పత్రాల వ్యవహారంతోపాటు భూ యజమానులపై భౌతిక దాడులకు కూడా ప్రయత్నించారని బాధితులు ఆరోపిస్తున్నారు. భూమి తమదేనని చెబుతూ.. అనుమతి లేకుండా ఫెన్సింగ్‌ పోల్స్‌ ఏర్పాటు చేశారని తెలిపారు. మూడు నెలల్లోగా స్థలాన్ని తమకు రిజిస్ట్రేషన్‌ చేయించకపోతే చంపేస్తామని ముఠా సభ్యులు బెదిరిస్తున్నారని రాజేష్‌, ఎంవీఎం రాజు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిరోజుల క్రితం బాబీ, ఆయన మేనల్లుడు సాయి కనకరాజు, సోంబాబుతోపాటు నకిలీ వీలునామా హోల్డర్‌ ఆకలి మహాలక్ష్మినాయుడు, పెందుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌, జనసేన నేత గొరపల్లి సోమునాయుడు తదితరులు తమను బెదిరించారని వారు ఆరోపించారు. వెంటనే స్థలాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అగ్రిమెంట్‌ ఉందంటూ జనసేన నేత హడావుడి

మరోవైపు ఈ భూమిపై తనకూ హక్కులు ఉన్నాయంటూ పెందుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌, జనసేన నేత గొరపల్లి సోమునాయుడు రంగంలోకి దిగినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ భూమికి సంబంధించి తన వద్ద అగ్రిమెంట్‌ ఉందని ఆయన పేర్కొంటున్నట్లు తెలిపారు. భూ వివాదాలు, ఆక్రమణల విషయంలో జనసేన నేతల జోక్యాన్ని ఉపేక్షించబోమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు. తన వెనుక ఎమ్మెల్యే అండ ఉందని, ఎలాగైనా ఈ స్థలాన్ని దక్కించుకుంటామని సోమునాయుడు చెబుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. దీంతో అధికార కూటమికి చెందిన నేతల అండతోనే భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రక్షణ కల్పించాలంటూ ఫిర్యాదు

అధికారం అండతో బాబీ గ్యాంగ్‌ తమ భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తోందని, తమకు ప్రాణహాని ఉందని పేర్కొంటూ రాజేష్‌, ఎంవీఎం రాజు పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించడంతోపాటు.. భూ ఆక్రమణకు ప్రయత్నిస్తున్న వారిపై సమగ్ర దర్యాప్తు జరిపి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని కోరారు. ఇదే విషయంపై నగర సీపీ శంఖబ్రత బాగ్చిని కూడా కలిసి ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement