ప్రభుత్వాస్పత్రుల్లో.. రోగుల రోదనలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాస్పత్రుల్లో.. రోగుల రోదనలు

Aug 20 2026 12:05 AM | Updated on Aug 20 2026 12:05 AM

● వైద్యం అందక అవస్థలు ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం ● 9వ రోజుకు చేరిన జూనియర్‌ వైద్యుల సమ్మె

మహారాణిపేట: ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల రోదనలు మిన్నంటుతున్నాయి. ప్రధానంగా పెద్దాస్పత్రి కేజీహెచ్‌లో పేద రోగుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తొమ్మిది రోజులుగా జూనియర్‌ డాక్టర్లు విధులు బహిష్కరించి రోడ్డెక్కినా.. అత్యవసర సేవలు నిలిచిపోయి రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారినా.. చంద్రబాబు ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కనిపించడం లేదు. పాలకుల మొండివైఖరితో కేజీహెచ్‌తో పాటు నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులన్నీ ఇప్పుడు రోగుల పాలిట నరకకూపాలుగా మారాయి.

అల్లాడుతున్న రోగులు

కేజీహెచ్‌లోని అత్యవసర విభాగంతో పాటు సాధారణ వార్డుల్లోనూ పర్యవేక్షించే వారు లేకపోవడంతో రోగులు అల్లాడిపోతున్నారు. అయితే బుధవారం ఓపీలో 2,600 మంది రోగులకు వైద్య సేవలు అందాయని, 69 శస్త్ర చికిత్సలు జరిగినట్లు కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వాణి ప్రకటించారు.

పోస్ట్‌కార్డుల ఉద్యమం

సమస్యల పరిష్కారం కోసం జూనియర్‌ డాక్టర్లు పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్‌ అసోసియేషన్‌ నేతలు దినకర్‌ సాయి శ్రీనివాస్‌, కె.రవీంద్ర, డాక్టర్‌ శిరాజ్‌ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రులకు తమ డిమాండ్లతో కూడిన పోస్ట్‌కార్డులను పంపించారు. గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అనంతరం తమ డిమాండ్‌ సాధన కోసం కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయం ఎదుట ధర్నా, అనంతరం బీచ్‌ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించి తమ గళాన్ని వినిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement