మహారాణిపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకం, ఎన్నికల సామగ్రి సిద్ధం, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలను బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ వివరించారు. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ప్రాథమిక సమాచారాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, డీపీవో శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో నారాయణమూర్తి, అదనపు కమిషనర్ రమణమూర్తి, ఎస్‌డీసీ గోవింద్, ఎలక్షన్ సెల్ అధికారి మూర్తి తదితరులు పాల్గొన్నారు.


