ఏయూలో బదిలీలలు | - | Sakshi
Sakshi News home page

ఏయూలో బదిలీలలు

Aug 13 2026 12:33 AM | Updated on Aug 13 2026 12:33 AM

నాన్‌ టీచింగ్‌ సిబ్బంది స్థానచలనాలపై చెలరేగుతున్న దుమారం అస్మదీయులకు నచ్చిన చోట పోస్టింగ్‌లు అవినీతి ఆరోపణలున్న విభాగాల్లో జరగని బదిలీలు పదవీ విరమణకు నెల రోజులున్న ఉద్యోగిపై బదిలీ వేటు చక్రం తిప్పిన ఆ ముగ్గురు?

విశాఖ విద్య: ఏయూలో నాన్‌టీచింగ్‌ బదిలీల ప్రక్రియపై దుమారం చెలరేగుతోంది. ఇందులో అస్మదీయులకు పెద్దపీట వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా అవినీతి ఆరోపణలు ఉన్న విభాగాల్లో స్థానచలనాలు జరగకపోవడం పట్ల ఉద్యోగ వర్గాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మూడు నుంచి ఐదేళ్ల వరకు ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న వారిని బదిలీ చేస్తున్నట్లు అధికారులు చెప్పినప్పటికీ.. వాస్తవానికి అందుకు భిన్నంగా 105 మంది సీనియర్‌ అసిస్టెంట్‌ బదిలీలు చేపట్టినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. ఇందులో పారదర్శకత లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అస్మదీయులకు అండ.. పేషీ ఏకపక్ష నిర్ణయం

సాధారణంగా రిజిస్ట్రార్‌ కార్యాలయం బదిలీల జాబితాను సిద్ధం చేసి తుది ఆమోదం కోసం వైస్‌ ఛాన్సలర్‌ వద్దకు ఫైల్‌ పంపడం ఆనవాయితీ. కానీ, దానికి భిన్నంగా వీసీ పేషీ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వర్సిటీ చరిత్రలో ఇలా మునుపెన్నడూ జరగలేదని సిబ్బంది విస్తుపోతున్నారు. వీసీ పేషీ, రిజిస్ట్రార్‌ పేషీలలో గత 15 ఏళ్లుగా తిష్టవేసిన ఉద్యోగులకు మాత్రం ఎలాంటి స్థానచలనం కల్పించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పరీక్షల విభాగంలోని సిబ్బందిని కూడా బదిలీ చేయకపోవడం గమనార్హం. వారంతా ఎవరిని ప్రసన్నం చేసుకున్నారనేది ఇప్పుడు క్యాంపస్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.

సర్వీస్‌ రూల్స్‌ పక్కనపెట్టి...

ఆంధ్రప్రదేశ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం ఆరు నెలల్లో పదవీ విరమణ పొందే ఉద్యోగులను బదిలీ చేయకూడదనే స్పష్టమైన నిబంధన ఉంది. కానీ, ఏయూ యాజమాన్యం ఈ నిబంధనలకు పాతరేసింది. సైన్స్‌ కాలేజీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కింతాడ అప్పలనాయుడు వచ్చే సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేయనున్నారు. రిటైర్మెంట్‌ నోటీసు అందుకున్న నాటి నుంచి నో డ్యూస్‌ దరఖాస్తు అందించడం, సర్వీస్‌ రిజిస్టర్‌ ఆడిట్‌ చేయించి బెనిఫిట్స్‌ ఖరారు చేసే ప్రక్రియ సాగుతుంది. సరిగ్గా నెల రోజుల్లో రిటైర్‌ అయ్యే ఉద్యోగిని కూడా వేరే విభాగానికి బదిలీ చేయడంపై ఉద్యోగ వర్గాలు విస్తుపోతున్నాయి.

మండిపడుతున్న ఉద్యోగ వర్గాలు

ఏళ్లుగా పాతుకుపోయిన అవినీతి సిబ్బందిని ప్రక్షాళన చేయడానికే బదిలీలు చేపట్టామని ఏయూ యాజమాన్యం సమర్థించుకుంటున్నప్పటికీ, వీసీ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోందని ఉద్యోగులు మండిపడుతున్నారు. పారదర్శకంగా జరగాల్సిన బదిలీల ప్రక్రియను కూడా వివాదాస్పదంగా మార్చడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చక్రం తిప్పుతున్న ‘ఆ ముగ్గురు’

ఏయూలో ఏ నిర్ణయమైనా వైస్‌ ఛాన్సలర్‌ ఫైనల్‌ అని అనుకున్నప్పటికీ, పరిపాలనా విభాగంలోని ప్రధాన సెక్షన్లలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న ముగ్గురు సీనియర్‌ ఉద్యోగులే వీసీని నడిపిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ బదిలీల పర్వంలో వారందరి స్థానచలనం ఖాయమని భావించినప్పటికీ, తమ పట్టుతో బదిలీ కాకుండా తప్పించుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌–3 విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన సొంత సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ అనుకూలంగా వ్యవహరించారని ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement