వన్యప్రాణులకు
ఆరిలోవ: భానుడు భగభగలాడుతున్నాడు.. సెగలు పుట్టిస్తున్నాడు. మనుషులే ఎండ వేడికి అల్లాడిపోతుంటే, ఎన్‌క్లోజర్లలో ఉండే మూగజీవాల పరిస్థితి ఏమిటి? అందుకే, నగరంలోని ఇందిరాగాంధీ జూ పార్కు అధికారులు అప్రమత్తమయ్యారు. వన్యప్రాణులకు వేసవి తాపం తగలకుండా ‘కూల్’ ఏర్పాట్లు చేస్తున్నారు. సందర్శకులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు.
మెనూలో మార్పులు
వేసవిలో వన్యప్రాణులు నీరసించకుండా జూ అధికారులు ఆహారంలో కీలక మార్పులు చేశారు. కేవలం మాంసం, గడ్డి మాత్రమే కాకుండా.. శరీరంలో నీటి శాతాన్ని పెంచే పండ్లు, ద్రవ పదార్థాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లకు తాగే నీటిలో గ్లూకోజ్ పౌడర్, పాలిబియాన్ కలిపి అందిస్తున్నారు. చింపాంజీలకు నిత్యం కొబ్బరి బొండాల నీటిని అందిస్తూ వాటిని ఉత్సాహంగా ఉంచుతున్నారు. పులులు, ఎలుగుబంట్లు, కోతులు తదితర జంతువులకు నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఆహారంగా అందిస్తున్నారు.
గజరాజులకు ‘జల’ విహారం : ఏనుగులకు వేసవిలో నీరు చాలా అవసరం. అందుకే వాటి కోసం ప్రత్యేకంగా 10,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ట్యాంకును, స్నానం చేయడానికి ప్రత్యేక తొట్టిని సిద్ధం చేశారు. నిత్యం వాటిపై నీటిని చిలకరిస్తూ ఎండ దెబ్బ తగలకుండా చూస్తున్నారు. చింపాంజీ నైట్‌క్రాల్స్‌లో చల్లదనం కోసం ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేశారు.
సందర్శకులకు ఆర్వో నీరు
కేవలం జంతువులకే కాదు, జూ సందర్శనకు వచ్చే పర్యాటకుల కోసం కూడా పక్కా ఏర్పాట్లు చేశారు. జూ అంతటా ఆరు చోట్ల ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్నారు. సందర్శకులు విశ్రాంతి తీసుకోవడానికి షెడ్‌లను సిద్ధం చేశారు. ఏనుగులు, పులులు, ఎలుగుబంట్లు, జింకలు, కనుజులు, జిరాఫీలు ఎన్‌క్లోజర్ల వద్ద, పక్షులు, పాములు, కోతులు జోన్ల వద్ద షెడ్‌లను సందర్శకుల కోసం శుభ్రం చేయిస్తున్నారు.
ఎన్‌క్లోజర్లలో పందిళ్లు.. సందర్శకులకు ఆర్వో నీళ్లు జూలో ఎండలను తట్టుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు
ఎన్‌క్లోజర్లలో ‘నేచురల్ ఏసీ’
జంతువుల నివాస ప్రాంతాలను చల్లబరిచేందుకు సహజసిద్ధమైన పద్ధతులను వాడుతున్నారు. జింకలు, కోతులు, పులులు, ఎలుగుబంట్లు, సింహాలు తదితర జంతువుల ఎన్‌క్లోజర్లలో ఎండ తగలకుండా తాటాకులతో పాకలు వేస్తున్నారు. నైట్‌క్రాల్స్ పైన వేడి తగ్గడానికి తెల్లటి వైట్ వాష్ వేశారు. పక్షుల ఎన్‌క్లోజర్లలో వట్టివేళ్ల (కస్‌కస్ గడ్డి) చాపలను ఏర్పాటు చేసి, వాటిని రోజుకు మూడు నాలుగు సార్లు నీటితో తడుపుతున్నారు. దీని వల్ల లోపల వాతావరణం ఏసీ గదిలా చల్లగా మారుతోంది. పాముల జోన్, ఇతర ఎన్‌క్లోజర్లలో స్పింక్లర్లు అమర్చి తేమను కాపాడుతున్నారు.


