రౌడీషీటర్ ఘాతుకం.. యువకుడి హత్య
ఎంవీపీకాలనీ: నగరంలోని ఇసుకతోట రామాలయం సమీపంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాతకక్షల నేపథ్యంలో బొచ్చు వెంకటేష్(19) అనే యువకుడు రౌడీషీటర్ చేతిలో దారుణ హత్యకు గురవగా, బాకీ సంతోష్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం సంతోష్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనలో రౌడీషీటర్ పల్లా అనిల్ ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడికావడంతో పోలీసు శాఖ అప్రమత్తమైంది. నిత్యం రౌడీషీటర్లను పర్యవేక్షిస్తున్నా, తరచూ కౌన్సెలింగ్‌లు ఇస్తున్నా.. ఇలాంటి ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాలివి..
రణస్థలం, పూసపాటిరేగ ప్రాంతాలకు చెందిన బొచ్చు వెంకటేష్, బాకీ సంతోష్ వరుసకు అన్నదమ్ములు. ఉపాధి నిమిత్తం వీరిద్దరూ విశాఖలో ఉంటున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న పల్లా అనిల్‌పై ఎంవీపీకాలనీ పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది. గతంలో అతని ఆగడాలు మితిమీరడంతో పోలీసులు నగర బహిష్కరణ కూడా చేశారు. కొంతకాలం రణస్థలంలో ఉన్న అనిల్ ఇటీవల మళ్లీ నగరానికి చేరుకున్నాడు. రణస్థలంలోనే అనిల్‌కు, వెంకటేష్‌కు పరిచయాలు ఉన్నాయి. కాగా.. వెంకటేష్ భార్య విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా తగాదాలు నడుస్తున్నాయి. దీనిపై గతంలోనే వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, మూడు నెలల కిందట పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా వీరి మధ్య వివాదం సద్దుమణగలేదు. ఇటీవల మరోసారి గొడవ జరగడంతో ‘చూసుకుందాం రా’ అంటూ వెంకటేష్ సవాల్ విసిరినట్లు సమాచారం. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో ఇసుకతోట రామాలయం వద్ద వెంకటేష్, అనిల్ తరఫు వాళ్లు తలపడ్డారు. ముందస్తు పథకం ప్రకారం కత్తితో సిద్ధంగా వచ్చిన అనిల్, ఒక్కసారిగా వెంకటేష్, సంతోష్‌లపై దాడి చేశాడు. బలమైన కత్తిపోట్లు తగలడంతో వెంకటేష్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సంతోష్ తీవ్ర గాయాలపాలవగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నైట్ బీట్ పోలీసులు అక్కడికి చేరుకుని సంతోష్‌ను వెంటనే కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనలో సుమారు 12 మంది యువకులు పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీపీ నరసింహమూర్తి గురువారం తెలిపారు.


