మహారాణిపేట: తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఓ గర్భిణికి కేజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. పలు విభాగాల వైద్యుల సమన్వయంతో చికిత్స అందించి తల్లి, బిడ్డను క్షేమంగా డిశ్చార్జ్ చేసినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. నర్సీపట్నం ప్రాంతానికి చెందిన అనిత (20) గర్భిణిగా ఉండగా తీవ్రమైన రక్తహీనత (హీమోగ్లోబిన్ కేవలం 5 గ్రాములు)తో ఈ నెల 27న కేజీహెచ్ గైనకాలజీ విభాగాన్ని సంప్రదించింది. యూనిట్ చీఫ్ డాక్టర్ సౌమిని ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్. గీతావందన పర్యవేక్షణలో అనితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో అనితకు తీవ్రమైన కామెర్లు, చిన్న రక్తకణాల లోపం, జ్వరం, అలాగే గర్భాశయంలో ఉమ్మనీరు (అమ్నియోటిక్ ఫ్లూయిడ్) చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అదనంగా మలేరియా, ఆటో ఇమ్యూన్ హీమోలిటిక్ అనీమియా కూడా ఉన్నట్లు తేలింది. ఆమె పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో సుమారు 50–60 యూనిట్ల రక్తాన్ని క్రాస్‌మ్యాచ్ చేసినప్పటికీ సరిపోలకపోవడంతో జనరల్ మెడిసిన్ సహా పలు విభాగాల వైద్యులు కలిసి ప్రత్యేక చికిత్స అందించారు. అనంతరం ఈ నెల 11న 6.4 గ్రాముల హీమోగ్లోబిన్ స్థాయిలోనే, తక్కువ ఉమ్మనీరుతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడంతో డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్ వాణి తెలిపారు. ఈ సందర్భంగా చికిత్సలో పాల్గొన్న గైనకాలజీ, ఇతర విభాగాల వైద్యులను ఆమె అభినందించారు.


