తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌! | - | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌!

Mar 20 2026 7:50 AM | Updated on Mar 20 2026 7:50 AM

● యలమంచిలిలో దొంగల బీభత్సం ● ఒకే రోజు పలు ఇళ్లల్లో ఆభరణాలు, నగదు అపహరణ

● యలమంచిలిలో దొంగల బీభత్సం ● ఒకే రోజు పలు ఇళ్లల్లో ఆభరణాలు, నగదు అపహరణ

యలమంచిలి రూరల్‌: యలమంచిలి పట్టణంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలు జరుగుతున్నాయి. ఎవరైనా రెండ్రోజులు ఇంటికి తాళం వేసి ఎక్కడికై నా వెళ్తే తిరిగి వారొచ్చేసరికి ఆ ఇల్లు గుల్లవుతోంది. బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత పట్టణంలోని రాంనగర్‌, టిడ్కో గృహ సముదాయాల్లో పలు ఇళ్లలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీలకు పాల్పడ్డారు. తాళాలు, తలుపు గడియలు పగులగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి అందిన బంగారు వెండి వస్తువులతో పాటు నగదు అపహరించుకుపోయారు. రాంనగర్‌ మన్నా చర్చి పక్కన విశ్రాంత సైనికోద్యోగి మేడిశెట్టి సూరిబాబు తన భార్యతో కలిసి ఇటీవల కొద్ది రోజుల క్రితం హైదరాబాదు వెళ్లారు. ఇంట్లో పెంపుడు కుక్కకు ఆహారం పెట్టమని తమకు తెలిసిన ఒక మహిళకు పురమాయించారు. రోజూలాగే గురువారం మధ్యాహ్నం కుక్కకు అన్నం పెట్టడానికి ఇంటికి వచ్చిన మహిళ తలుపులన్నీ తెరిచి ఉండడం చూశారు. తాళాలు పగులగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని గుర్తించి యజమానికి ఫోన్‌ ద్వారా సమాచారం అందజేశారు. బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు చోరీకి గురైనట్టు భావిస్తున్నారు. టిడ్కో కాలనీలో బీ3 బ్లాకులో జీఎఫ్‌ 7 ప్లాట్‌లో సీరందాసు మురళి, పూజిత దంపతులు కొత్త అమావాస్య ఉగాది పండుగల సందర్భంగా మంగళవారం పెదపల్లి వెళ్లారు. బుధవారం రాత్రి వారుంటున్న ఇంట్లో చోరీ జరిగింది. సుమారు 10 తులాల వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే కాలనీలో బీ2 బ్లాకు జీఎఫ్‌ 6లో నివాసముంటున్న ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న కొండేటి సుధీర్‌ బుధవారం రాత్రి డ్యూటీకి వెళ్లి గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి ప్లాటు తాళాలు విరగ్గొట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందర చేసిన దొంగలు పర్సులో దాచిన రూ.3500 నగదు పట్టుకుపోయారని బాధితుడు తెలిపారు. జీఎఫ్‌ 10లో అద్దెకుంటున్న శెట్టి జ్యోతి పై ఫ్లాట్‌లో బుధవారం రాత్రి నిద్రపోవడానికి వెళ్లారు. ఉదయం వచ్చి చూడగా తన ఇంట్లో చోరీ జరిగినట్టు గుర్తించారు. ఏ4 బ్లాకులో గంగమ్మ, వెంకన్న ఉంటున్న జీఎఫ్‌6 ప్లాటులో కూడా చోరీ జరిగింది. వీరిద్దరూ నాలుగు రోజుల క్రితం వేరే ఊరు వెళ్లారు. తాళాలు తొలగించి ఇంట్లోకి చొరబడిన దొంగలు విలువైన వస్తువులు అపహరించుకుపోయారని తెలిసింది. చోరీలకు పాల్పడిన నిందితులు ఇళ్లలో బీరువాలు, కప్‌ బోర్డుల్లో వస్తువులు, దుస్తులు చిందరవందర చేసి ఆభరణాలు, నగదు అపహరించుకుపోయారు. ఒకేరోజు పలు ఇళ్లలో చోరీలు జరగడంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పట్టణ పోలీసులు రాత్రి గస్తీ పెంచి చోరీలకు అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement