గ్యాస్‌ గండం | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ గండం

Mar 12 2026 7:10 AM | Updated on Mar 12 2026 7:10 AM

ఆరిపోతున్న పొయ్యిలు అల్లాడుతున్న హోటల్‌ పరిశ్రమ!

గురువారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2026

యుద్ధం వాతావరణంతో వాణిజ్య సిలిండర్ల కొరత

జిల్లాలో నెలకు 70 వేల కమర్షియల్‌ సిలిండర్లు అవసరం

ప్రస్తుతం 12 వేల సిలిండర్లే సరఫరా

గ్యాస్‌ సిలిండర్ల కోసం హోటల్‌ యజమానుల తిప్పలు

జంబ్లింగ్‌ పద్ధతిలో సిలిండర్లు సరఫరా చేయాలని అసోసియేషన్‌ విజ్ఞప్తి

సాక్షి, విశాఖపట్నం : వేకువజామున నగర వీధుల్లో వినిపించే గరిటెల చప్పుళ్లు, హోటళ్ల నుంచి వచ్చే ఆ ఘుమఘుమల వాసనలు ఇక తగ్గిపోతాయేమో అన్న ఆందోళన నెలకొంది. దేశ సరిహద్దుల్లో కమ్ముకున్న యుద్ధ మేఘాల ప్రభావం ఇప్పుడు విశాఖ హోటల్‌ పరిశ్రమపై పడుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల కారణంగా సప్లయ్‌ చైన్‌ దెబ్బతినడంతో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల కొరత తీవ్రమైంది. నిత్యం మంటలు ఎగిసే హోటల్‌ పొయ్యిలు ఇప్పుడు ఆరిపోతున్నాయి. ఇది కేవలం గ్యాస్‌ కొరత సమస్య మాత్రమే కాదు... వేలాది మంది ఉపాధి, లక్షలాది మంది ఆకలి సమస్యగా మారే పరిస్థితి కనిపిస్తోంది. పాత స్టాక్‌ పూర్తిగా అయిపోవడంతో గురువారం నుంచి కమర్షియల్‌ సిలిండర్లు సరఫరా చేయలేమని డిస్ట్రిబ్యూటర్లు ప్రకటించడంతో హోటల్‌ యజమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

డిమాండ్‌కు సరిపోని సరఫరా

జిల్లా వ్యాప్తంగా హోటల్‌, రెస్టారెంట్‌ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. సాధారణ పరిస్థితుల్లో జిల్లాలోని హోటళ్లకు ప్రతి రోజు సుమారు 5 వేల సిలిండర్లు, నెలకు దాదాపు 1.5 లక్షల కమర్షియల్‌ సిలిండర్లు అవసరం. అయితే ప్రస్తుతం సరఫరా 20 శాతం కూడా లేని పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం వరకు కొంతమేర సరఫరా జరిగినా, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఒక్క సిలిండర్‌ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. గ్యాస్‌ కోసం హోటల్‌ యజమానులు ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్నా... పొయ్యి ముట్టించలేని పరిస్థితి నెలకొంది.

‘జంబ్లింగ్‌ పద్ధతి’ అమలు చేయాలి

ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు హోటల్‌ అసోసియేషన్‌ ప్రభుత్వం ముందుకు కీలక ప్రతిపాదన తీసుకువచ్చింది. అందరికీ సమానంగా గ్యాస్‌ అందేలా ‘జంబ్లింగ్‌ పద్ధతి’ అమలు చేయాలని కోరుతోంది. రోజు విడిచి రోజు హోటళ్లకు సిలిండర్లు సరఫరా చేస్తే చిన్న, మధ్య తరహా హోటళ్లు కనీసం మనుగడ సాగించగలవని అసోసియేషన్‌ ప్రతినిధులు జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై వెంటనే స్పందించకపోతే వందలాది హోటళ్లు మూతపడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరా పునరుద్ధరించాలి

ల్ఫ్‌ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాపై ఆంక్షలు విధించడం హోటల్‌ పరిశ్రమకు తీవ్ర దెబ్బ. జిల్లాలోని వేలాది హోటళ్లు, ముఖ్యంగా రోడ్డు పక్కన ఉన్న చిన్న వ్యాపారులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. గ్యాస్‌ సరఫరా నిలిచిపోతే వేలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోతారు. అలాగే ఆహార పదార్థాల ధరలు పెరిగి సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి కమర్షియల్‌ గ్యాస్‌ సరఫరాను తక్షణం పునరుద్ధరించాలి లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.

– జి.బాలకృష్ణ, విశాఖ హోటల్‌ ఓనర్స్‌

అసోసియేషన్‌ అధ్యక్షుడు

పర్యాటక నగరానికి పెద్ద దెబ్బ

విశాఖపట్నం పర్యాటక నగరంగా దేశవ్యాప్తంగా పేరు పొందింది. ప్రతిరోజూ వేలాది మంది పర్యాటకులు, వ్యాపార అవసరాలతో వచ్చే ఇతర జిల్లాల ప్రజలతో నగరం కిటకిటలాడుతుంది. జిల్లాలో సుమారు 1000 నుంచి 1500 వరకు చిన్నా పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు పనిచేస్తూ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు ఈ రంగంపై పడుతోంది. భారతదేశం ఇంధన అవసరాల కోసం ప్రధానంగా మధ్యప్రాచ్య దేశాలపై ఆధారపడుతుంది. ఇరాన్‌ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ముడి చమురు, సహజ వాయువు దిగుమతుల్లో ఆటంకాలు ఏర్పడ్డాయి. సముద్ర మార్గాల్లో నౌకల రాకపోకలు మందగించడం, ఇన్సూరెన్స్‌ ప్రీమియంలు పెరగడం వంటి కారణాలతో గ్యాస్‌ సరఫరా తగ్గింది. విశాఖపట్నం పోర్టు ద్వారా జరిగే దిగుమతుల్లో జాప్యం ఏర్పడటంతో స్థానిక గ్యాస్‌ బాట్లింగ్‌ ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నాయి. దీని ప్రభావం నేరుగా కమర్షియల్‌ సిలిండర్ల పంపిణీపై పడింది.

మూతపడే దిశగా హోటళ్లు

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్ల పంపిణీపై కేంద్రం ఆంక్షలు విధించడంతో అనేక ఏజెన్సీలు ‘నో స్టాక్‌’ బోర్డులు పెట్టాయి. గురువారం నుంచి కమర్షియల్‌ సిలిండర్ల సరఫరా నిలిపివేయాల్సి వస్తుందని ప్రకటించాయి. దీంతో కేవలం హోటల్‌ వ్యాపారమే కాదు, ఈ రంగంపై ఆధారపడి జీవించే వేలాది మంది కార్మికుల ఉపాధి కూడా ప్రమాదంలో పడింది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిన నేపథ్యంలో గ్యాస్‌ కొరత పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. కొన్ని హోటళ్ల వద్ద రెండు మూడు సిలిండర్లు మాత్రమే నిల్వ ఉండటంతో ఒకటి రెండు రోజులు మాత్రమే వ్యాపారం కొనసాగించగలమని యజమానులు చెబుతున్నారు. ఆ తర్వాత తామూ షట్టర్లు మూసివేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement