సైబర్ బాధితులకు తిరిగి అందజేసిన నగదు
అల్లిపురం: సైబర్ నేరగాళ్ల బారిన పడి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకున్న బాధితులకు నగర పోలీసులు భారీ ఊరటనిచ్చారు. చట్టపరమైన ప్రక్రియ ద్వారా రికార్డు స్థాయిలో నగదును రికవరీ చేసి, బాధితులకు తిరిగి అందజేశారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఈ వివరాలను వెల్లడించారు. వివిధ సైబర్ మోసాలకు గురైన 1,240 మంది బాధితులకు సంబంధించి, నేరగాళ్ల ఖాతాల్లో హోల్డ్, ఫ్రీజ్ అయిన రూ.22,47,54,369 నగదును తిరిగి బాధితులకు అందజేసినట్లు సీపీ ప్రకటించారు. రాష్ట్రంలోనే ఇంత పెద్ద మొత్తంలో సైబర్ బాధితులకు నష్టపరిహారం అందించడం ఒక చారిత్రాత్మక మైలురాయి అని ఆయన పేర్కొన్నారు. సైబర్ నేరాలపై ఫిర్యాదు అందగానే తక్షణమే స్పందించడం, బ్యాంకులు, సంబంధిత ఆర్థిక సంస్థలతో నిరంతరం సమన్వయం సాధించడం వల్లనే ఈ నగదును తిరిగి రాబట్టడం సాధ్యమైందని వివరించారు. కేసుల దర్యాప్తులో భాగంగా ఇప్పటివరకు మొత్తం 558 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ కేసులకు సంబంధించి 470 మంది, సోషల్ మీడియా సంబంధిత కేసుల్లో 88 మంది ఉన్నట్లు సీపీ తెలిపారు. ముఖ్యంగా వేధింపులకు గురి చేస్తున్న ఇన్‌స్టెంట్ లోన్ యాప్‌లపై కఠిన చర్యలు తీసుకున్నామని, ఈ క్రమంలో సుమారు రూ.60 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కోర్టు ఆదేశాల మేరకు అందులోని రూ.57.24 లక్షల మొత్తాన్ని 126 మంది బాధితులకు చెక్కుల రూపంలో పంపిణీ చేసినట్లు వెల్లడించారు.


