సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా కార్గో నిర్వహణ, ట్రక్కుల రాకపోకలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత డిజిటల్ స్మార్ట్ గేట్ల ద్వారా నిర్వహించే వ్యవస్థను అదానీ గంగవరం పోర్టు అమల్లోకి తీసుకొచ్చింది. పూర్తిగా ఆటోమేటెడ్ విధానంలో పనిచేసే ఈ డిజిటల్ గేట్ల ద్వారా పోర్టులోకి ట్రక్కుల రాకపోకలతో పాటు వే–బ్రిడ్జ్, పార్కింగ్ ప్రాంతాల నిర్వహణ కూడా మరింత సులభతరం కానుంది. విమానాశ్రయాల్లో అమలులో ఉన్న డిజి యాత్ర తరహాలోనే పోర్టులో ట్రక్కుల రాకపోకలను నిర్వహించే విధంగా ఈ సిస్టమ్‌ను రూపొందించినట్లు అదానీ గంగవరం పోర్టు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ మాలిక్ తెలిపారు. ఈ డిజిటల్ గేట్లను కస్టమ్స్ అండ్ సీజీఎస్‌టీ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్. శ్రీధర్ ప్రారంభించారు. సాధారణంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు ముందుగానే డిజి యాత్ర యాప్‌లో తమ వివరాలను నమోదు చేసుకుంటారు. అనంతరం విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) ద్వారా స్కాన్ చేసి క్యూలు లేకుండా వేగంగా లోనికి వెళ్లే అవకాశం కలుగుతుంది. ఇదే విధానాన్ని గంగవరం పోర్టులోనూ అమలు చేసినట్లు సీఈఓ వివరించారు. పోర్టులోకి వచ్చే ట్రక్కుల వివరాలను ముందుగానే యాప్‌లో నమోదు చేయడం ద్వారా వాహనాలు పోర్టు గేట్ల వద్ద నిలిచిపోకుండా నేరుగా ప్రవేశించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆటోమేటిక్ గేట్ క్లియరెన్స్, టైమ్ ట్రాకింగ్ వ్యవస్థల ద్వారా ట్రక్కుల రాకపోకలు సాఫీగా సాగుతాయని చెప్పారు. దీంతో పోర్టు పరిధిలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు కార్గో నిర్వహణ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు.
ఐరన్ ఓర్ బ్లెండింగ్ యూనిట్ ఏర్పాటు
గంగవరం పోర్టులో అత్యాధునిక ఐరన్ ఓర్ బ్లెండింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి పోర్టు యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్‌ఎండీసీతో పాటు బ్రెజిల్‌కు చెందిన వాలె ఎస్.ఏ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు పోర్టు సీఈఓ అమిత్ మాలిక్ వెల్లడించారు. పోర్టు పరిసరాల్లో ఉన్న సుమారు 1,850 ఎకరాల ఖాళీ భూమిని ఈ ప్రాజెక్టు కోసం వినియోగించనున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ఏర్పాటు కోసం ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. పెట్టుబడి మొత్తం, ప్రాజెక్టు విస్తీర్ణం వంటి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధమైన తర్వాత 24 నుంచి 30 నెలల్లో యూనిట్ పూర్తవుతుందని ఆయన తెలిపారు.
పోర్టు సామర్థ్యం పెంపు
ప్రస్తుతం గంగవరం పోర్టు సామర్థ్యం 40 మిలియన్ మెట్రిక్ టన్నులు (ఎంఎంటీ)గా ఉండగా, దాన్ని 75 ఎంఎంటీలకు పెంచే ప్రణాళికలను అమలు చేస్తున్నట్లు అమిత్ మాలిక్ చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఈ లక్ష్యాన్ని సాధించాలని యాజమాన్యం భావిస్తోంది. ఐరన్ ఓర్ బ్లెండింగ్ యూనిట్ ఏర్పాటుతో పోర్టు పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.


