అల్లిపురం: నగరంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు పోలీసు–ప్రజల సమన్వయంతో ‘ట్రాఫిక్ సోల్జర్స్’ అనే వినూత్న కార్యక్రమాన్ని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ప్రారంభించారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో 206 మంది ట్రాఫిక్ సోల్జర్స్‌తో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని ప్రధాన జంక్షన్లు, పాఠశాలల సమీపం, మార్కెట్లు, ఆసుపత్రులు వంటి రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ సోల్జర్స్ ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహకరిస్తారని తెలిపారు. ముఖ్య కూడళ్ల వద్ద పాదచారులు, వృద్ధులు, మహిళలు, చిన్నారులు సురక్షితంగా రోడ్లు దాటేందుకు వీరు సహాయపడతారన్నారు. అదేవిధంగా వాహనదారులకు హెల్మెట్లు, సీట్‌బెల్ట్‌లు తప్పనిసరిగా వినియోగించాలనే విషయంపై అవగాహన కల్పించడం, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ ఉపయోగించవద్దని సూచించడం వంటి బాధ్యతలను కూడా నిర్వర్తిస్తారని చెప్పారు. పండగలు, ర్యాలీలు, వీఐపీల రాక సందర్భంగా ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహించడంలో వీరు పోలీసులకు తోడ్పడతారన్నారు. సిగ్నల్ జంప్, రాంగ్ పార్కింగ్, రాష్ డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందించడంలో సహకరించడంతో పాటు అత్యవసర సేవల కోసం సంబంధిత ఎమర్జెన్సీ నంబర్లకు సమాచారం ఇవ్వడం కూడా వీరి బాధ్యతగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ ఓ.ప్రవీణ్ కుమార్, ట్రాఫిక్ ఏసీపీ వాసుదేవ్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


