సరదాలు.. సంతోషాలు
మిన్నంటిన 2026 స్వాగత సంబరాలు
జనసంద్రమైన బీచ్‌రోడ్ ఆలయాలకు పోటెత్తిన జనం
ఏయూక్యాంపస్: నగరంలో నూతన సంవత్సరోత్సాహం ఉప్పొంగింది. 2025 జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, కోటి ఆశలతో 2026కు నగరవాసులు ఘనంగా స్వాగతం పలికారు. సాగర తీరం మొదలుకొని.. ఆలయాల వరకు ఎక్కడ చూసినా పండగ వాతావరణమే కనిపించింది. అటు వినోదం, ఇటు దైవచింతన, మరోవైపు పర్యావరణ స్పృహతో వైజాగ్ వాసులు కొత్త ఏడాదిని సరికొత్తగా ఆరంభించారు.
బీచ్‌రోడ్‌లో జనజాతర
ఆర్.కె.బీచ్ గురువారం సందర్శకులతో కిటకిటలాడింది. సాగరతీరం సంతోషాల సంగమంగా మారింది. చిన్నారుల కేరింతలు, యువత కేకలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి అలల సాక్షిగా సెల్ఫీలు దిగుతూ యువత సందడి చేసింది. చిన్నారులు, యువత ఉల్లాసంగా గడుపుతూ, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగర వాసుల నవ్వులు, ఆనందాల మధ్య కొత్త ఏడాది జోష్ స్పష్టంగా కనిపించింది. వినోదంతో పాటు భక్తికి కూడా నగరవాసులు పెద్దపీట వేశారు. 2026లో తమ లక్ష్యాలు నెరవేరాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ గురువారం ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తారు. సంపత్ వినాయగర్ ఆలయం, సింహాచలం, కనకమహాలక్ష్మి తదితర ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక పూజలతో కళకళలాడాయి. క్రిస్టియన్లు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఫాదర్, బిషప్‌లు శాంతి సందేశాన్ని అందించగా, కేక్‌లు కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.
యువత ‘హరిత’ స్వాగతం
కేవలం సంబరాలకే పరిమితం కాకుండా.. నగర యువత తమ సామాజిక బాధ్యతను కూడా చాటుకుంది. గ్రీన్ ఇయర్‌గా మార్చుకోవాలనే సంకల్పంతో పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టింది. బీచ్‌రోడ్డులో వైజాగ్ వలంటీర్స్ ఆధ్వర్యంలో యువత పర్యాటలకు, నగరవాసులకు మొక్కలు పంపిణీ చేసింది. పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, మొక్కలు నాటడం ద్వారానే పర్యావరణాన్ని రక్షించుకోగలమని సందేశాన్నిచ్చారు. నగరవాసులు కూడా అంతే ఉత్సాహంతో మొక్కలను స్వీకరించి, వాటిని సంరక్షిస్తామని హామీ ఇచ్చారు. మొత్తంగా ఆనందోత్సాహాల మధ్య, ఆశావహ దృక్పథంతో 2026లోకి నగర ప్రజలు అడుగుపెట్టారు.
సరదాలు.. సంతోషాలు
సరదాలు.. సంతోషాలు
సరదాలు.. సంతోషాలు
సరదాలు.. సంతోషాలు


