న్యూ ఇయర్ కిక్కు..!
విశాఖ సిటీ: విశాఖలో మందుబాబులు విశ్వరూపం చూపించారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో తెగ తాగేశారు. మూడు రోజుల్లో రూ.20 కోట్ల మేర మద్యాన్ని గుటకేసేశారు. 2025కు వీడ్కోలు పలుకుతూ కొందరు.. 2026కు స్వాగతం పలుకుతూ మరికొందరు సంబరాలు చేసుకుంటే.. మందుబాబులు మాత్రం తాగడమే ఉద్యమంలా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒక రోజు ముందు నుంచే న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమైపోయారు. దీంతో విశాఖలో కొత్త సంవత్సరం కళంతా వైన్‌షాపులు, బార్ల వద్దే కనిపించింది. దీంతో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగినట్లు తెలుస్తోంది.
ఒక్క రోజే రూ.9.5 కోట్లు తాగేశారు..
మందుబాబులు 30వ తేదీ నుంచే తమ ఉద్యమానికి సిద్ధమైపోయారు. అందుకు తగ్గట్లుగానే వైన్‌షాప్, బార్ల నిర్వాహకులు భారీగా స్టాకును విడిపించి గొడౌన్లను నింపేసుకున్నారు. ఈ మద్యం ద్వారా చంద్రబాబు ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవాలని ముందుగానే నిర్ణయించింది. ఇందుకోసం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచేందుకు అనుమతించింది. దీంతో అర్ధరాత్రి సమయాల్లో కూడా వైన్‌షాపులు, బార్లు మందుబాబులతో కళకళలాడుతూ కనిపించాయి. 30వ తేదీ మధ్యాహ్నం నుంచే మద్యం దుకాణాల వద్ద హడావుడి మొదలైంది. 31వ తేదీకి రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగిన్నట్లు తెలుస్తోంది. గతేడాది 31, 1 తేదీల్లో మొత్తంగా రూ.12 కోట్లు మద్యం అమ్మకాలు జరగగా.. ఈసారి 31వ తేదీ ఒక్కరోజే రూ.9.5 కోట్ల మేర మద్యం విక్రయాలు జరగడం గమనార్హం. 30, 31, 1వ తేదీల్లో మొత్తంగా రూ.20 కోట్ల మేర మద్యాన్ని తాగేశారు.
మందుబాబుల హల్‌చల్..
నూతన సంవత్సరం వేళ నగరంలో మందుబాబులు తప్పతాగి చిందులేశారు. బహిరంగంగానే మద్యం సేవించారు. తాగిన మత్తులో రోడ్లపై బైక్‌లతో చక్కర్లు కొట్టారు. ఒకవైపు పోలీసుల నిఘా ఉన్నప్పటికీ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. దీంతో పోలీసులు బహిరంగంగా మద్యం తాగిన 99 మందిపైన, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన 257 మందిపైన కేసులు పెట్టారు.


