విశాఖ రేంజ్ ఐజీగా గోపీనాథ్ బాధ్యతల స్వీకరణ
విశాఖ సిటీ: విశాఖ రేంజ్ డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న గోపీనాథ్ జట్టి పదోన్నతి పొందారు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీ)గా గురువారం ఆయన రేంజ్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కార్యాలయంలోని ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఆయన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేంజ్ పరిధిలోని ఎస్పీలు తుహిన్ సిన్హా (అనకాపల్లి), అమిత్ బర్దర్ (అల్లూరి), కె.వి.మహేశ్వర్‌రెడ్డి (శ్రీకాకుళం), ఎస్.వి.మాధవరెడ్డి (మన్యం), ఎ.ఆర్.దామోదర్ (విజయనగరం) ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. పూల మొక్కలను అందించి పదోన్నతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారుల సమక్షంలో ఐజీ కేక్ కట్ చేశారు. నూతన సంవత్సరంలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా ఐజీ ఆకాంక్షించారు. రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేర నియంత్రణకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేశారు. వేడుకల్లో రేంజ్ పరిధిలోని డీఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు, కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


