మళ్లీ చర్చకు వాయిదా అంశాలు
నేడు జీవీఎంసీ స్థాయీ సంఘ
సమావేశం
అజెండాలో యోగా డే
మొబైల్ టాయిలెట్ల బిల్లులు
అవినీతి జరిగిందంటూ గతంలో
సభ్యుల ఆరోపణలు
ఐఎఫ్‌ఆర్ పనుల కోసం
రూ.2.30 కోట్ల ప్రతిపాదనలు
డాబాగార్డెన్స్: తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణల కారణంగా గతంలో వాయిదా పడిన అంశాలనే మళ్లీ ఆమోదం కోసం స్థాయీ సంఘ సమావేశం అజెండాలో చేర్చిన తీరు జీవీఎంసీలో చర్చనీయాంశమైంది. గత ఏడాది యోగా డే సందర్భంగా ఏర్పాటు చేసిన మొబైల్ టాయిలెట్ల బిల్లుల చెల్లింపు వ్యవహారం ఇందులో ప్రధానంగా ఉంది. శుక్రవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జరగనున్న సమావేశంలో ఈ అంశం మరోసారి చర్చకు రానున్నాయి.
మళ్లీ తెరపైకి యోగా డే బిల్లులు
గత ఏడాది జూన్ 21న నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం మొబైల్ టాయిలెట్లను ఏర్పాటు చేసింది. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన ఆరు నెలల తర్వాత, గత డిసెంబర్ 6న జరిగిన సమావేశంలో దాదాపు రూ.1.62 కోట్ల బిల్లుల చెల్లింపునకు అనుమతి కోరుతూ ప్రతిపాదనలు పెట్టారు. ఒక్కో పోర్టబుల్ వీఐపీ టాయిలెట్ యూనిట్‌కు రోజుకు రూ.16,200 చొప్పున అద్దె నిర్ణయించడంపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దీనిపై ‘సాక్షి’ దినపత్రికలో ‘మొబైల్ టాయిలెట్ మస్కా’ పేరిట కథనం కూడా ప్రచురితమైంది. గత సమావేశంలో ఈ అంశంపై స్థాయీ సంఘం సభ్యులు సాడి పద్మారెడ్డి, రాపర్తి త్రివేణి వరప్రసాదరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో భారీగా అవినీతి జరిగిందని, దీనిపై పూర్తి స్థాయి విచారణ జరపాలని వారు పట్టుబట్టడంతో మేయర్ ఆ అంశాన్ని వాయిదా వేశారు. అయితే.. ఆ విచారణ ఏమైందో, నివేదిక ఏమొచ్చిందో తెలియకుండానే.. శుక్రవారం జరిగే సమావేశంలో అవే బిల్లులను ఆమోదం కోసం అజెండాలో చేర్చడం గమనార్హం.
87 అంశాలతో సమావేశం
శుక్రవారం సమావేశంలో మొత్తం 87 అంశాలు సభ్యుల ఆమోదానికి రానున్నాయి. వీటిలో అభివృద్ధి పనులు, రెవెన్యూ, సర్వీస్ అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరిలో ఆర్.కె.బీచ్ వేదికగా జరగనున్న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష (ఐఎఫ్‌ఆర్)–2026 కోసం దాదాపు రూ.2.30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జీవీఎంసీ 29వ వార్డు పరిధిలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు రూ.36.36 లక్షలతో బ్లాక్ టాప్ రోడ్లు, ఎన్టీఆర్ విగ్రహం నుంచి కోస్టల్ బ్యాటరీ తూర్పు వైపు రూ.35.30 లక్షలతో బీటీ రోడ్డు పునరుద్ధరణ, 32వ వార్డు అల్లిపురం రోడ్డు ఉత్తరం వైపు బీటీ రోడ్డుకు రూ.36.40 లక్షలు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఫుట్‌పాత్‌లు, సెంట్రల్ డివైడర్ మరమ్మతులు, పెయింటింగ్‌కు రూ.25.80 లక్షలు, పోలీస్ బ్యారెక్స్ జంక్షన్ నుంచి చౌల్ట్రీ జంక్షన్ వరకు రూ.35.40 లక్షలతో బీటీ రోడ్డు, 37వ వార్డు బీచ్‌రోడ్డు భారత్ పెట్రోలియం బంక్ నుంచి నేవల్ క్యాంటీన్ వరకు రూ.33.50 లక్షలతో రోడ్డు పనులు, నేవల్ క్యాంటీన్ కొత్త జాలరిపేట జంక్షన్ వద్ద దెబ్బతిన్న కల్వర్టు పునర్‌నిర్మాణానికి రూ.27.25 లక్షలు తదితర పనులకు పరిపాలనా పరమైన ఆమోదం కోసం కమిటీ ముందుంచనున్నారు.


