బీచ్‌రోడ్డులో కుంగిన రోడ్డు
ఏయూక్యాంపస్: బీచ్‌రోడ్డులో ప్రయాణం వాహనదారులకు కత్తిమీద సాములా మారింది. పోలీస్ మెస్‌కు ఎదురుగా ఉన్న ప్రధాన రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు తక్షణ చర్యగా ఇక్కడ ఒక స్టాపర్‌ను ఏర్పాటు చేసినప్పటికీ.. రాత్రి వేళల్లో వేగంగా వచ్చే వాహనాలకు ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ మార్గంలో రహదారి కుంగిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు రోడ్డు దెబ్బతినడం, అధికారులు మరమ్మతులు చేయడం పరిపాటిగా మారింది. తాత్కాలిక మరమ్మతుల పేరిట ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నప్పటికీ, సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని వాహనచోదకులు అంటున్నారు. ఈ మార్గంలో తరచూ రోడ్డు ఎందుకు కుంగుతోందనే అంశంపై అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.


