కోవిడ్ టీకా మర్మమిదే..!
టీకా ప్రభావం ఆరు నెలలకు మాత్రమే..
ఏయూ పరిశోధనలో సైంటిఫిక్ సస్పెన్స్‌కు తెర
ప్రపంచాన్ని భయపెట్టిన ప్రశ్నకు ఆంధ్ర యూనివర్సిటీ సమాధానం
ఏయూ పీజీ విద్యార్థుల పరిశోధనలో వెల్లడి
సాక్షి, విశాఖపట్నం: యావత్ ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్ పేరు చెబితే.. ఇప్పటికీ వణుకే. టీకా వచ్చినా.. కరోనా వైరస్ వ్యాప్తి ఆగలేదు. లక్షల మంది ప్రాణాల్ని తీసిన ఈ వైరస్‌ని సమూలంగా నాశనం చేసే మందు ఇప్పటికీ కనిపెట్టలేకపోవడమే దీనికి ప్రధాన కారణం. కోవిడ్ కోసం రెండు టీకాలు వచ్చినా.. దీని ప్రభావం 6 నెలలు మాత్రమే ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. అసలెందుకు టీకా ప్రభావవంతంగా ఉండటం లేదనే అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు పరిశోధనలు చేశారు. దాదాపు రెండున్నరేళ్లు చేసిన ఈ పరిశోధనల్లో అనేక విషయాలు వెల్లడయ్యాయి. టీకా అంటే జీవితకాలం అని వైద్యరంగం చెబుతుంటుంది. కానీ కోవిడ్ టీకా కాలం కేవలం 6 నెలలు మాత్రమేననే అంశం అప్పట్లో ఒకింత సంచలనం.. కొంత ఆందోళన.. మరింత ఆలోచనల్లో పడేసింది. అందుకే ఏయూలో పీజీ చదువుతున్న విద్యార్థుల బృందం.. దీని వెనుక ఉన్న అసలు రహస్యాన్ని ఛేదించేందుకు పరిశోధనలు ప్రారంభించింది. టీకా వేసినా.. కరోనా వైరస్ తప్పించుకోగలుగుతోంది.? టీకా ప్రభావం ఎందుకు పూర్తిస్థాయిలో చూపించలేకపోతోందనే అంశంపై రీసెర్చ్ నిర్వహించారు. దాదాపు రెండున్నరేళ్ల అనేక పరిశోధనల తర్వాత.. వైరస్‌పై కోవిడ్–19 టీకా పనితనానికి సంబంధించిన విషయాల్ని పసిగట్టారు. ఆ–హబ్‌లోని టీక్యాబ్స్ – ఇ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ రవికిరణ్ యేడిది మార్గదర్శకత్వంలో ఈ పరిశోధనలు చేపట్టారు.
అస్థిరత్వమే అసలు కారణం
టీకా దీర్ఘకాలం పనిచెయ్యకపోవడానికి అసలు కారణం.. వైరస్ ఎప్పటికప్పుడు వివిధ వేరియంట్లలోకి రూపాంతరం చెందేలా ఉన్న అస్థిరత్వమే అసలు కారణమని విద్యార్థుల పరిశోధనల్లో స్పష్టమైంది. కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్ లో కొన్ని భాగాలు అస్థిరత్వం కలిగి ఉండడం వలన అవి ఘనపదార్ధాలుగా కాకుండా క్షణిక కాలం పాటు ద్రవ స్థితిలోకి పరివర్తనం చెందుతున్నాయి. అందువల్లే మనం తీసుకున్న కోవిడ్–19 టీకా ప్రభావంతో శరీరంలో ఉత్పల్తైన వైరస్ ప్రతిరోధకాలు ఈ మార్పుల కారణంగా అయోమయ పరిస్థితిలోకి వెళ్లిపోతున్నాయి. అందుకే.. వైరస్ ను నిరోధించే సామర్థ్యాన్ని త్వరగా కోల్పోతున్నాయని విద్యార్థులు తమ పరిశోధనల ద్వారా స్పష్టం చేశారు.
అంతర్జాతీయ శాసీ్త్రయ పత్రికలో ప్రచురితం
ఈ పరిశోధనల్లో ఎంఫార్మసీ విద్యార్థి మణికంఠ సోడసాని, డీఫార్మసీకి చెందిన అభినవ్ గ్రంధి, నిహారిక మూకల(ఎమ్మెస్సీ), జాహ్నవి చింతలపాటి (ఎమ్మెస్సీ), మాధురి విస్సాప్రగడ (ఎమ్మెస్సీ) తోపాటు మధుమిత అగ్గున్న(ఎంఎస్) పాల్గొన్నారు. బయోఫిజిక్స్, కంప్యూటర్ సిములేషన్స్, మోలెక్యూలర్ బయాలజీ , బయోకెమిస్ట్రీ, జీన్ క్లోనింగ్ ప్రయోగాలు నిర్వహించారు. విభిన్న తరహాలో కోవిడ్–19 టీకాపై చేసిన ఏయూ విద్యార్థుల పరిశోధనల ఫలితాల్ని.. ప్రతిష్టాత్మక ఎల్సేవియర్ అంతర్జాతీయ శాసీ్త్రయ పత్రిక బీబీఏలో ప్రచురించడం విశేషం. అద్భుత పరిశోధనలు చేసిన బృందాన్ని ఏయూ వీసీ ప్రొ.జీపీ రాజశేఖర్ అభినందించారు.


