మెరిసిన గిరిజన తేజం
పాంగి కరుణ మెరుపు ఇన్నింగ్స్
విశాఖ స్పోర్ట్స్/కొమ్మాది: కంటిచూపు లేకపోతేనేం? గుండె నిండా ఆత్మవిశ్వాసం ఉంది. పేదరికం వెంటాడితేనేం? అలుపెరుగని పట్టుదల ఉంది. ఆ పట్టుదలే ఆమెను మారుమూల గిరిజన గ్రామం నుంచి అంతర్జాతీయ క్రికెట్ వేదికపై నిలబెట్టింది. శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన తొలి మహిళా అంధుల టీ–20 ప్రపంచకప్‌లో భారత జట్టు విజయకేతనం ఎగురవేయడంలో గిరిజన విద్యార్థిని పాంగి కరుణకుమారి కీలక పాత్ర పోషించింది.
బీ1 కేటగిరీలో భారత జట్టుకు ఎంపికై..
ఆదివారం కొలంబోలో నేపాల్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో కరుణకుమారి తన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. వన్‌డౌన్‌లో బ్యా టింగ్‌కు వచ్చిన ఆమె.. కేవలం 27 బంతుల్లోనే 42 పరుగు లు చేసింది. ఓపెనర్ సరీన్‌తో కలిసి ఆమె నెలకొల్పిన భాగస్వామ్యం భారత్ విజయానికి బాటలు వేసింది. కరుణకుమారి రైట్ హ్యాండ్ బ్యాటర్ మాత్రమే కాదు, తన స్పిన్ బౌలింగ్‌తోనూ ప్రత్యర్థులను కట్టడి చేయగల ఆల్ రౌండర్. సాగర్‌నగర్‌లోని ప్రభుత్వ అంధ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఆమె.. బీ1 కేటగిరీలో భారత జట్టుకు ఎంపికై ఈ ఘనత సాధించింది.
అడవి బిడ్డ అలుపెరుగని ప్రయాణం
పాడేరు మండలం, వంట్లమామిడికి చెందిన రాంబాబు, సంధ్య దంపతుల కుమార్తె కరుణ. పుట్టుకతోనే దృష్టిలోపం, పెరిగే కొద్దీ పేదరికం ఆమె చదువుకు అడ్డంకిగా మారాయి. చూపు మందగించడంతో మధ్యలోనే బడి మానేసిన కరుణను.. ఓ ఉపాధ్యాయుడు సాగర్‌నగర్‌లోని అంధ బాలికల పాఠశాలలో చేర్పించారు. అక్కడ పీఈటీ ప్రోత్సాహంతో క్రికెట్ బ్యాట్ పట్టిన కరుణ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
శబ్దమే ఆమెకు దిక్సూచి
‘నాకు బాల్ కనపడదు. కానీ నా మైండ్‌తో, చెవులతో దాని రాకను పసిగట్టి కొడతాను’అని కరుణ చెబుతున్నప్పుడు ఆమెలోని ఆత్మవిశ్వాసం కళ్లకు కడుతుంది. సెలక్షన్స్ సమయంలో జరిగిన ఓ మ్యాచ్‌లో 60 బంతుల్లోనే 114 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచినప్పుడే ఆమె సత్తా ఏంటో సెలెక్టర్లకు అర్థమైంది. ఇప్ప టివరకు 31 మ్యాచ్‌లు ఆడిన కరుణకుమారి 462 పరుగులు చేయడంతో పాటు, తన స్పిన్ మాయాజాలంతో వికెట్లు కూడా పడగొట్టింది. అయితే ఆమె ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు. కరుణ విజయంపై పాఠశాల యాజమాన్యం, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆమెను జిల్లా ఇన్‌చార్జి మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అభినందించారు.


