
సీఫుడ్ ఎగుమతిదారులసమస్యలు పరిష్కరిస్తాం
కేంద్ర కార్యదర్శి అవినాష్ జోషి
మహారాణిపేట: సీఫుడ్ ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర పుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కార్యదర్శి అవినాష్ జోషి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో సీఫుడ్ ఎగుమతిదారులతో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఎగుమతిదారుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, అలాగే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఏపీ పుడ్ ప్రాసెసింగ్ కార్యదర్శి చిరంజీవి చౌదరి మాట్లాడుతూ సీఫుడ్ వినియోగాన్ని మరింత పెంచడానికి అందరూ కృషి చేయాలని కోరారు. సమీక్షలో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామ్ శంకర్ నాయక్, జేసీ మయూర్ అశోక్, మత్స్యశాఖ జేడీ పి.లక్ష్మణరావు, సీఫుడ్ సంస్థల ప్రతినిధులు పవన్ కుమార్, జి.ఎస్.రావు, డిప్యూటీ డైరెక్టర్ అన్సార్ ఆలీ, ఎంపెడకు చెందిన విజయ్ కుమార్, మన్మధరావు తదితరులు పాల్గొన్నారు.