
అంచనాలకు మించి ఎగుమతులు
అగనంపూడి: దువ్వాడ వీఎస్‌ఈజెడ్(విశాఖపట్నం ప్రత్యేక ఆర్థిక మండలి) అంచనాలకు మించి ఎగుమతులతో దూసుకుపోతోంది. మొదటి త్రైమాసికంలో (2025 ఏప్రిల్ నుంచి జూన్ వరకు) రూ.58,565 కోట్ల విలువైన వస్తు, సేవలను ఎగుమతి చేయగలిగామని వీఎస్‌ఈజెడ్ డెవలప్‌మెంట్ కమిషనర్ ముప్పాళ్ల శ్రీనివాస్ వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే 9.82 శాతం వృద్ధి రేటు సాధించామన్నారు. దువ్వాడ వీఎస్‌ఈజెడ్ పరిపాలన భవనంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఏడాది తొలి మూడు నెలలతో పోల్చితే ఈసారి మెరుగైన ప్రగతి సాధించగలిగామన్నారు. ఇందులో రూ. 42,766 కోట్ల విలువైన సేవలు, రూ.15,799 కోట్ల విలువైన వస్తువులను విదేశాలకు ఎగుమతి చేసి, విదేశీ మారక ద్రవ్యాన్ని రాబట్టగలిగామన్నారు. అలాగే దువ్వాడ సెజ్ రూ.1,834 కోట్ల ఎగుమతులు సాధించి 156 శాతం వృద్ధిని నమోదు చేసిందన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 9 కొత్త యూనిట్ల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసినట్లు శ్రీనివాస్ వివరించారు. ఈ ఆర్థిక మండలి పరిధిలో ఇప్పటివరకు 6,03,474 మందికి ఉపాధి కల్పించినట్లు చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడంలో సెజ్‌లు, యూనిట్ల యాజమాన్యం, ఉద్యోగుల సహకారం ఎంతగానో ఉందని ఆయన అభినందించారు.