
జీవీఎంసీ జోన్ల పునర్వ్యవస్థీకరణ
జోన్లు రద్దు చేసి నియోజకవర్గాల వారీగా వార్డులు ఒకే నియోజకవర్గంలోని వార్డులతో కొత్త జోన్ ఏర్పాటు జీవీఎంసీ కౌన్సిల్ ఆమోదం కోసం అజెండాలో 38వ అంశంగా చేర్చిన అధికారులు
డాబాగార్డెన్స్ : జీవీఎంసీ పరిపాలనలో అనూహ్య మార్పులు చోటుచేసుకోనున్నాయి. అస్తవ్యస్తంగా ఉన్న జోన్ వ్యవస్థ స్థానంలో నియోజకవర్గం యూనిట్‌గా కొత్త జోన్లు ఏర్పాటు కానున్నాయి. పరిపాలన సౌలభ్యం, పారదర్శకత కోసం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదించడానికి ఈ అంశాన్ని అజెండాలో చేర్చారు. గత కౌన్సిల్ సమావేశంలో టేబుల్ అజెండా – 1గా సభ్యుల దృష్టికి వచ్చినప్పటికీ వాయిదా వేశారు. ఇప్పటి వరకు జీవీఎంసీ పరిధిలో 8 జోన్లు ఉన్నాయి. ఒక్కో జోన్ పరిధిలో 8 నుంచి 15 వరకు వార్డులు ఉన్నాయి. ఒక్కో జోన్ రెండు, మూడు నియోజకవర్గాల పరిధిలో ఉంది. దీంతో పరిపాలన సక్రమంగా జరగడం లేదని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ విధానాన్ని మార్పు చేయాలని దీర్ఘకాలంగా డిమాండ్ ఉంది. దీంతో ఒక్కో నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని జోన్లు ఏర్పాటు చేస్తే పరిపాలన సులభతరం అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతమున్న 8 జోన్లను 8 నియోజకవర్గాల జోనల్ కార్యాలయాలుగా మార్చనున్నారు.
వార్డుల మార్పులు ఇలా...
జోన్ – 2 పరిధిలో ఇప్పటి వరకు 9, 10, 11, 12, 13వ వార్డులు ఉన్నాయి. వాటిని విశాఖ తూర్పు జోన్‌లో విలీనం చేయనున్నారు. జోన్ – 3లోని 14వ వార్డును ఉత్తర జోన్‌లోని 15వ వార్డును తూర్పు జోన్‌లో, 27వ వార్డును దక్షిణ జోన్‌లో విలీనం చేయనున్నారు. జోన్ – 4 పరిధిలో ఉన్న 28వ వార్డును విశాఖ తూర్పులో, 41వ వార్డును దక్షిణంలో కలపనున్నారు. జోన్ – 8 పరిధిలోని 42వ వార్డును ఉత్తరంలో, 89, 90, 91, 92వ వార్డులను పశ్చిమలో, 93వ వార్డును పెందుర్తిలో, 98వ వార్డును భీమిలిలో కలపాలని ప్రతిపాదించారు. జోన్ – 6లో ఉన్న 72, 79, 88వ వార్డులను పెందుర్తిలో, 78, 85వ వార్డులను గాజువాకలో విలీనం చేయనున్నారు.
నియోజకవర్గాల వారీగా జోన్లు
నియోజకవర్గాల వారీగా జోన్లు ఏర్పాటు చేయాలని అధికారులు, పాలకవర్గం ప్రతినిధులు భావిస్తున్నారు. దీని ప్రకారం విశాఖలో 8 నియోజకవర్గాల పరిధిలో విస్తరించిన జీవీఎంసీని 8 జోన్లుగా విభజించనున్నారు. ఇకపై ఒక నియోజకవర్గానికి ఒక జోనల్ కార్యాలయం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకే జోనల్ కార్యాలయం పరిధిలో రెండు, మూడు నియోజకవర్గాల పరిధి ఉండే అవకాశం లేకుండా వార్డుల విలీన ప్రక్రియను చేపడుతున్నారు. భీమిలి జోన్‌లో 9 వార్డులు, తూర్పులో 15, ఉత్తరలో 17, దక్షిణలో 13, పశ్చిమలో 14, గాజువాకలో 17, అనకాపల్లిలో 5, పెందుర్తి జోన్‌లో 8 వార్డులు ఉండనున్నాయి. ఈ నూతన వ్యవస్థకు ఆమోద ముద్ర వేసేందుకు కౌన్సిల్‌లో చర్చించనున్నారు. కౌన్సిల్‌లో ఆమోదం తర్వాత తదనుగుణంగా ఏర్పాట్లు చేయనున్నారు.
కొత్త జోన్ల స్వరూపం ఇలా...
భీమిలి జోన్ : జీవీఎంసీ 1 నుంచి 8 వరకు, 98వ వార్డు
తూర్పు జోన్ : 9 నుంచి 13 వరకు, 15 నుంచి 23 వరకు, 28వ వార్డు
నార్త్ జోన్ : 14, 24, 25, 26, 42 నుంచి 51 వరకు, 53, 54, 55వ వార్డు
సౌత్ జోన్ : 27, 29 నుంచి 39 వరకు, 41వ వార్డు
వెస్ట్ జోన్ : 40, 52, 56 నుంచి 63 వరకు, 89 నంచి 92 వరకు
గాజువాక జోన్ : 64 నుంచి 76 వరకు, 78, 85, 86, 87వ వార్డు
అనకాపల్లి జోన్ : 80 నుంచి 84 వరకు
పెందుర్తి జోన్ : 77, 79, 88, 93 నుంచి 97 వరకు.