దేవుడి పేరుతో వ్యాపారం చేయొద్దు | - | Sakshi
Sakshi News home page

దేవుడి పేరుతో వ్యాపారం చేయొద్దు

Aug 20 2025 6:03 AM | Updated on Aug 20 2025 6:03 AM

దేవుడి పేరుతో వ్యాపారం చేయొద్దు

దేవుడి పేరుతో వ్యాపారం చేయొద్దు

వినాయక దర్శనాలకు టికెట్లు వద్దు

మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి

అన్ని శాఖల అధికారులు, మండపాల నిర్వాహకులతో సీపీ సమావేశం

విశాఖ సిటీ: వినాయక మండపాల్లో దర్శనానికి టికెట్లు ఏర్పాటు చేయకూడదని నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. మంగళవారం పోలీస్‌ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో పాటు వినాయక మండపాల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపాల ఏర్పాటుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని సూచించారు. మండపాల ఏర్పాటుకు దరఖాస్తు చేస్తే, అంతే వేగంగా అనుమతులు మంజూరు అవుతాయన్నారు. ఎంత ఖర్చు చేసినప్పటికీ.. దేవుడి పేరుతో వ్యాపారం చేయకూడదని స్పష్టం చేశారు. దర్శనాలకు టికెట్లు, పార్కింగ్‌ చార్జీలు, చీరలు, నగదు వసూలు చేయకూడదని తేల్చి చెప్పారు. ఈ ఏడాది నుంచి డ్రోన్‌లతో నిఘా పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

భద్రతా చర్యలు–మార్గదర్శకాలు

● మండపాల నిర్వాహకులు విద్యుత్‌ పనులు ప్రారంభించే ముందు లోపల, బయట కరెంట్‌ తీగలను పరిశీలించాలి. కరెంట్‌ తీగలు మండపానికి తాకకుండా జాగ్రత్త పడాలి.

● షార్ట్‌ సర్క్యూట్‌ అవకుండా అధిక వేడి ఉత్పత్తి చేసే బల్బులు, కవర్‌ లేని హాలోజన్‌ ల్యాంప్స్‌ వాడకూడదు.

● ఊరేగింపులు, నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో సరైన బారికేడింగ్‌, లైటింగ్‌, పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్‌, సీసీ కెమెరాలు, జనరేటర్లు ఏర్పాటు చేయాలి.

● విగ్రహాల నిమజ్జనం అధికారికంగా గుర్తించిన ప్రదేశాల్లో మాత్రమే జరగాలి.

● మండపాల్లో పేలుడు పదార్థాలు ఉంచకూడదు. నూనె దీపాలు వెలిగించేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం.

● మండపాల సమీపంలో అగ్ని ప్రమాదానికి కారణమయ్యే పదార్థాలను ఉంచకూడదు. నీరు, ఇసుక తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.

● నిమజ్జన ఊరేగింపుల్లో బాణసంచా వాడకూడదు.

● లౌడ్‌ స్పీకర్లు, మైకుల వినియోగంపై పరిమితులు ఉండాలి. కాలుష్య నియంత్రణ మండలి నిర్ణయించిన డెసిబెల్‌ పరిమితిని అతిక్రమించకూడదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మైకులు వినియోగించకూడదు.

● మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి. పీవోపీ విగ్రహాల వాడకాన్ని నిరోధించేందుకు పాఠశాలలు, కళాశాలల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.

● నిమజ్జన ప్రాంతాల్లో తగినంత మంది ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలి.

● మండపాల్లో కనీసం ముగ్గురు వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలి. వారి ఫోన్‌ నంబర్లు స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు ఇవ్వాలి.

● అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలి. భక్తులు తెచ్చే పెద్ద బ్యాగులు, సూట్‌ కేసులు, పార్సిల్స్‌ను అనుమతించకూడదు.

● డీజే సిస్టమ్‌లు మండపాల్లోనూ, ఊరేగింపుల్లోనూ వినియోగించకూడదు.

● మండపాల్లో జూదం, మత్తు పదార్థాల వినియోగం పూర్తిగా నిషేధం. కమిటీ సభ్యులు దీనిపై బాధ్యత వహించాలి.

● మండపాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసి, 24 గంటల ఫుటేజ్‌ రికార్డ్‌ చేసి పర్యవేక్షించాలి.

● సోషల్‌ మీడియా, వాట్సాప్‌ ద్వారా వచ్చే పుకార్లను నమ్మకూడదు, ఫార్వర్డ్‌ చేయకూడదు. ఇలాంటివి వస్తే వెంటనే వాట్సాప్‌ నంబర్‌ 7995 095799 లేదా 100/112కు కాల్‌ చేయాలి.

● బలవంతంగా విరాళాలు వసూలు చేయకూడదు. లక్కీ డిప్స్‌, లాటరీలు నిర్వహించకూడదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement