
గల్లంతైన యువకుడు.. కరువైన ప్రభుత్వ సాయం
సొంత ఖర్చులతోనే
సతీష్ ఆచూకీ కోసం గాలింపు
ఎంవీపీకాలనీ: సముద్రంలో కొట్టుకుపోయిన అప్పుఘర్ ప్రాంతానికి చెందిన పిల్లా సతీష్ (24) అనే మత్స్యకార యువకుడి ఆచూకీ మూడు రోజులైనా లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం లాసన్స్ బే కాలనీ గెడ్డ వద్ద గేలంతో చేపలు పడుతుండగా, నీటి ప్రవాహం ఉధృతం కావడంతో ఆయన గెడ్డలోకి ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. అనంతరం సముద్రంలోకి కొట్టుకుపోయాడు. ప్రమా దం జరిగిన నాటి నుంచి ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి సహాయం చేయలేదని, తామే సొంత ఖర్చులతో గాలింపు చర్యలు చేపడుతున్నామని సతీష్ కుటుంబ సభ్యులు, తోటి మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ‘మా తమ్ముడి మృతదేహం కోసమైనా.. అప్పులు చేసి నాలుగు పడవల్లో డీజిల్ కొట్టించుకుని వెతుకుతున్నాం’ అని సతీష్ అన్నయ్య పిల్లా ఎల్లాజీ కన్నీటిపర్యంతమయ్యారు. ఘటనపై పోలీసులకు, మత్స్యకార శాఖకు సమాచారం ఇచ్చినా, వారు కేవలం కేసు నమోదుకే పరిమితమయ్యారని జాలరి ఎండాడకు చెందిన మత్స్యకారులు ఆరోపించారు. ప్రభుత్వ తీరుపై సంఘటన జరిగిన స్థలంలో మంగళవారం నిరసన తెలిపారు. జిల్లా యంత్రాంగం గానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ, ఈ ప్రాంతానికి కూతవేటు దూరంలో ఉంటున్న హోం మంత్రి గానీ కనీసం సతీష్ కుటుంబాన్ని పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పేదవాడికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా? ఇదే ఒక ధనిక వ్యక్తికి జరిగివుంటే ఇలాగే వ్యవహరించేవారా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి.. తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

గల్లంతైన యువకుడు.. కరువైన ప్రభుత్వ సాయం