
తల్లి చెంతకు తప్పిపోయిన బాలికలు
మర్రిపాలెం: ఇంటి నుంచి అదృశ్యమైన ఇద్దరు బాలికలు కంచరపాలెం పోలీసులు, ఒక మహిళ సహకారంతో క్షేమంగా తమ తల్లి చెంతకు చేరుకున్నారు. వివరాలివి. గవర కంచరపాలెంలో నివసిస్తున్న గేదెల రేఖ, ఆమె భర్త రైల్వే స్టేషన్‌లో ఒక ఫుడ్‌కోర్టులో పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి పని ముగించుకుని రేఖ ఇంటికి తిరిగి వచ్చేసరికి.. ఆమె ఇద్దరు కుమార్తెలు ఇంట్లో లేరు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో వెంటనే కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి, ఆ బాలికల వివరాలను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఇదే సమయంలో ఆర్.పి.పేట ప్రాంతానికి చెందిన ఒక మహిళ రాత్రి సమయంలో ఆ ఇద్దరు బాలికలు రైల్వే ట్రాక్ సమీపంలోని ఒక జిమ్ ఆవరణలో సంచరించడాన్ని గమనించింది. ఇక్కడ ఎందుకు ఉన్నారని వారిని ప్రశ్నించగా.. ఇంట్లో ఫోన్ పోయిందని, తల్లిదండ్రులు తిడతారని భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చామని వారు చెప్పారు. ఆ మహిళ వెంటనే స్థానిక అంగన్‌వాడీ కార్యకర్తకు విషయం చెప్పింది. రాత్రి కావడంతో ఆ కార్యకర్త ఆ ఇద్దరు బాలికలను తమ ఇంట్లోనే ఉంచి, ఉదయం అంగన్‌వాడీ కేంద్రానికి తీసుకెళ్లి సచివాలయం ఎంఎస్‌కేకు సమాచారం అందించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకుని బాలికలను స్టేషన్‌కు తీసుకెళ్లారు. మంగళవారం ఉదయం కంచరపాలెం సీఐ రవికుమార్ సమక్షంలో ఆ బాలికలను వారి తల్లి రేఖకు అప్పగించారు. దీంతో ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.