
చెదిరిపోని స్మృతుల ప్రతిబింబాలే ఫొటోలు
బీచ్‌రోడ్డులో ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఏయూక్యాంపస్: ఛాయా చిత్రాలు అనేక అనుభూతులను గుర్తు చేస్తాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకుని మంగళవారం విశాఖ మ్యూజియంలో వైజాగ్ ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నగరానికి చెందిన ఫొటో జర్నలిస్టులు తీసిన పలు ఛాయాచిత్రాలను ఆసక్తిగా తిలకించారు. ఈ ప్రదర్శన ఒకవైపు సుందర నగరాన్ని, మరో కోణంలో సమస్యలను చూపించే విధంగా ఉందన్నారు. గత ఏడాది కాలంలో జరిగిన అనేక సంఘటనలను గుర్తుచేసే విధంగా ఈ ప్రదర్శన ఉందని పేర్కొన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ఉత్తమ జర్నలిస్టులుగా అవార్డులు సాధించిన వారిని ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం అసోసియేషన్ తరపున కమిషనర్‌ను సన్మానించారు. విశాఖ మ్యూజియం అసిస్టెంట్ డైరెక్టర్ పాల్గుణరావు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనివాసరావు, జీవీఎంసీ పీఆర్‌వో నాగేశ్వర రావు, జెడ్సీ శివ ప్రసాద్, రాష్ట్ర ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎల్.మోహన రావు, వీపీజే అసోసియేషన్ అధ్యక్షులు వై.రామకృష్ణ, కార్యదర్శి ఎం.డి.నవాజ్, కోశాధికారి ఎ.శరత్ కుమార్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.