
రౌడీ షీటర్ల ఇళ్లల్లో మారణాయుధాలు
విశాఖ సిటీ: నగరంలో అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న వారిపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో నాటు తుపాకీ వ్యవహారం కలకలం రేపడంతో అన్ని ప్రాంతాలను జల్లెడ పట్టారు. పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు నగరంలో ఉన్న రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్ల ఇళ్లలో మంగళవారం తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జోన్–1, జోన్–2, క్రైమ్ విభాగంతో కలిపి మొత్తం 525 మంది అధికారులు సిబ్బందితో 103 బృందాలు ఏర్పడ్డారు. ప్రతి టీమ్ బాడీ వార్న్, మొబైల్ కెమెరాలను వినియోగిస్తూ సుమారు 500 మంది రౌడీ/సస్పెక్ట్ షీటర్ల ఇళ్లను తనిఖీలు చేశారు. ఇందులో మహిళా కానిస్టేబుళ్లు, హోమ్‌గార్డులు కూడా పాల్గొని ఇళ్లను పరిశీలించారు. వాహనాల రికార్డులు, అనుమానాస్పద వ్యక్తులు, మారణాయుధాలను గుర్తించారు. జోన్–1 పరిధిలో భీమిలిలో రెండు కత్తులను, ఎంవీపీ పరిధిలో ఒక ఇంట్లో కత్తి, 2 కేజీల గంజాయి, మరో ఇంట్లో సరైన లెక్కలు లేని రూ.6 లక్షల నగదు, 11 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే జోన్–2లో కంచరపాలెం పరిధిలో 2.5 కేజీ గంజాయి, గోపాలపట్నం పరిధిలో 11 క్వార్టర్ మధ్యం బాటిళ్లు సీజ్ చేశారు. క్రైమ్ అధికారులు, సిబ్బంది సస్పెక్ట్ షీటర్ల ఇళ్లలో నిర్వహించిన తనిఖీల్లో మూడో పట్టణ పరిధిలో చోరికి గురైన 4 మొబైల్ ఫోన్లు, ఫోర్త్‌టౌన్ పరిధిలో రెండు హ్యాండ్ గ్లవ్స్, గోపాలపట్నం పరిధిలో ఒక సస్పెక్ట్ షీటర్ ఇంట్లో ఒక వ్యక్తి గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు. వీరిపై కేసులు నమోదు చేశారు.

రౌడీ షీటర్ల ఇళ్లల్లో మారణాయుధాలు

రౌడీ షీటర్ల ఇళ్లల్లో మారణాయుధాలు