
పాలిటెక్నిక్ విద్యార్థులకు రష్యాలో ఉద్యోగావకాశాలు
మురళీనగర్: విశాఖలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులకు రష్యాలో నైపుణ్యాభివృద్ధి శిక్షణతో పాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని రష్యన్ ప్రతినిధుల బృందం తెలిపింది. భారత్–రష్యాల మధ్య సాంకేతిక విద్య, నైపుణ్యాభివృద్ధిపై కుదిరిన ఒప్పందంలో భాగంగా 12 మంది సభ్యుల రష్యన్ బృందం మంగళవారం కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించింది. ఈ బృందం మెటలర్జికల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ ప్రయోగశాలలను పరిశీలించింది. ఏపీలో డిప్లొమా స్థాయి విద్యలో అనుసరిస్తున్న పాఠ్యప్రణాళిక, బోధ నా పద్ధతులను వారు అధ్యయనం చేశారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ కె. రత్నకుమార్ వారికి వివరించారు. రష్యాలో పాలిటెక్నిక్ విద్యార్థులకు శిక్షణ, ఉద్యోగాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతినిధులు తెలిపారు. ఈ పర్యటనతో ఇరు దేశాల మధ్య సాంకేతిక, విద్యా సంబంధాలు మరింత బలపడతాయని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జనరల్ సెక్షన్ హెడ్ డాక్టర్ పీఎం. బాషా, ఫార్మసీ హెడ్ జే. గోవర్ధన్ రావు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.