
కూటమిపై వ్యతిరేకతకు స్థాయీ ఫలితాలే నిదర్శనం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నిక ఫలితాలే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అన్నారు. జీవీఎంసీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ కూటమి పార్టీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారంటే.. ప్రభుత్వంపై వ్యతిరేకత ఏ విధంగా ఉందో ఇట్టే అర్థమవుతోందన్నారు. ఈ ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలు డబ్బు, క్యాంపు రాజకీయం చేశాయన్నారు. వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన కార్పొరేటర్లకు తమ బలమైన 32 కంటే అధికంగా ఓట్లు వచ్చాయన్నారు. 50 ఓట్లతో ఒక సీటు గెలిచామన్నారు. కూటమి కార్పొరేటర్లు కూడా తమకు ఓటు వేయడం విశేషమన్నారు. కూటమి నేతలు భయభ్రాంతులకు గురి చేసినా ఎంతో ధైర్యంతో పోటీలో నిలిచిన వారికి అభినందనలు తెలిపారు. అయితే గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారని వాపోయారు. తమ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు అందించిన శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, విశాఖ జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు కదిరి బాబూరావు, నియోజకవర్గ సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, వాసుపల్లి గణేష్‌కుమార్, మళ్ల విజయప్రసాద్, మజ్జి శ్రీనివాసరావు, తిప్పల దేవన్‌రెడ్డి, మలసాల భరత్, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, జీవీఎంసీ వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, కార్పొరేటర్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.