నేటి నుంచి డిపోల్లో రేషన్ పంపిణీ
ఎండీయూ వాహనాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం
మహారాణిపేట: జిల్లాలో ఆదివారం నుంచి రేషన్ సరకులు నేరుగా రేషన్ డిపోల వద్ద పంపిణీ చేయనున్నారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎండీయూ వాహనాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసి ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని 642 డిపోల ద్వారా 5.34 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యం, పంచదార వంటివి పంపిణీ చేయనున్నారు. ఈ ఏర్పాట్లను జిల్లా ప్రత్యేక అధికారి భగవన్నారాయణ పర్యవేక్షించారు. ఆయన ఇప్పటికే డీలర్లతో సమావేశాలు నిర్వహించి, గోదాముల్లో సరకుల లభ్యత, డిపోల వద్ద ఏర్పాట్లు, ధరల పట్టికలు వంటి విషయాలను సమీక్షించారు. డీఎస్‌వో వి.భాస్కరరావు పోస్ మెషీన్ల మరమ్మతులు కూడా పూర్తి చేశారు. కాగా, ఇంటింటికీ రేషన్ సరఫరా చేసేందుకు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 310 ఎండీయూ వాహనాలను రద్దు చేయడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వాహనాల ద్వారా అనేక మంది ఉపాధి పొందారు. వీటిని నిలిపివేయడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
ఇదిలా ఉండగా.. చాలా మంది కార్డుదారులకు డిపోలు ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే సరుకులు వచ్చేవి కాబట్టి డిపోల గురించి చాలా మందికి అవగాహన లేదు. స్థానికంగా ఉన్న కొందరికి కూడా డిపోలు ఎక్కడున్నాయో తెలియకపోవడం గమనార్హం.


