అంధకారంలో కలెక్టరేట్
కాలిపోయిన ఎంసీబీ బోర్డులు
2 గంటల పాటు విద్యుత్ అంతరాయం
సెల్‌ఫోన్ వెలుగుల్లో అర్జీలు స్వీకరించిన
జేసీ మయూర్ అశోక్
తీవ్ర అసౌకర్యానికి గురైన అర్జీదారులు, అధికారులు
మహారాణిపేట: నగరంలోని కీలక ప్రభుత్వ విభాగాల్లో వరుసగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కేజీహెచ్‌లో అంధకారం నెలకొనగా, సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అత్యవసర సేవలు అందాల్సిన ఆస్పత్రిలోనూ, పరిపాలనా కేంద్రమైన కలెక్టరేట్‌లోనూ ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏవైనప్పటికీ, పనుల కోసం వచ్చిన సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కీలక కార్యాలయాల్లో బ్యాకప్ వ్యవస్థలు ఎందుకు పనిచేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో విద్యుత్ అంతరాయం కారణంగా తీవ్ర గందరగోళం నెలకొంది. ఉదయం 11:30 గంటల నుంచి విద్యుత్ సరఫరాలో తరచుగా అంతరాయం ఏర్పడటంతో అధికారులు, సిబ్బందికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. సిబ్బంది కారణాలను వెతుకుతున్న సమయంలోనే సమావేశ మందిరం బయట ఉన్న విద్యుత్ మీటర్ల వద్ద పెద్ద శబ్దం రావడంతో పాటు ఎంసీబీ ప్లాట్లు, సాకెట్లు కాలిపోయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన అందరూ ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. కలెక్టరేట్ మొత్తం అంధకారంగా మారింది. కంప్యూటర్లు, ఏసీలు, లైట్లు అన్నీ నిలిచిపోయాయి. సెల్‌ఫోన్ వెలుగుల్లో అర్జీలను జేసీ మయూర్ అశోక్ స్వీకరించారు. అటు అధికారులు, ఇటు ప్రజలు తీవ్ర ఉక్కపోతతో అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది సుమారు రెండు గంటల పాటు శ్రమించి మధ్యాహ్నం 1.30 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. అనంతరం జేసీ మయూర్ అశోక్ దరఖాస్తుదారులతో మాట్లాడి కార్యక్రమాన్ని ముగించారు.
అంధకారంలో కలెక్టరేట్
అంధకారంలో కలెక్టరేట్


