ఇక ఆన్‌లైన్‌లోనే సర్వే సర్టిఫికెట్లు
డాబాగార్డెన్స్: జీవీఎంసీ పరిధిలోని భవనాలు, ఖాళీ స్థలాలకు సంబంధించిన సర్వే సర్టిఫికెట్లను ఇకపై ఆన్‌లైన్ ద్వారానే సులభంగా పొందవచ్చని మేయర్ పీలా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ కేతన్ గార్గ్‌తో కలిసి ఆయన ఈ నూతన ఆన్‌లైన్ అప్లికేషన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే శ్రమ లేకుండా, పారదర్శక విధానంలో వారం రోజుల్లోనే సర్టిఫికెట్ పొందేందుకు ఈ వినూత్న వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. దరఖాస్తుదారులు తమ అప్లికేషన్ ఏ దశలో ఉందో కూడా నేరుగా వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, దీనిపై సచివాలయ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
పౌరులు అధికారిక జీవీఎంసీ వెబ్‌సైట్ ద్వారా తమ లాగిన్ వివరాలతో ప్రవేశించి, లేదా కొత్త వినియోగదారులుగా నమోదు చేసుకుని, సర్వేయర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. www.gvmc.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయిన తర్వాత, citizen services-e- Request- Surveyor Certificate విభాగాన్ని ఎంపిక చేసుకుని దరఖాస్తుదారుడి వివరాలు, ఆస్తి వివరాలు నమోదు చేసి, అవసరమైన సహాయ పత్రాలు అప్‌లోడ్ చేస్తూ ఆన్‌లైన్ నమోదు ఫారమ్ పూరించాలి. దరఖాస్తు అందజేసిన వెంటనే, దరఖాస్తు స్థితిని అనుసరించేందుకు ప్రత్యేక రిఫరెన్స్ నంబరు కనిపిస్తుంది. ఎంచుకున్న జోన్ ఆధారంగా దరఖాస్తు సంబంధిత టౌన్ సర్వేయర్‌కు వెళుతుంది. టౌన్ సర్వేయర్ సమర్పించిన వివరాలు, పత్రాలు పరిశీలించి సంబంధిత ప్రక్రియ జరుపుతారు. టౌన్ సర్వేయర్ ఆమోదించిన అనంతరం, దరఖాస్తు ఎస్టేట్ అధికారికి తుది పరిశీలనకు పంపుతారు. ఎస్టేట్ అధికారి ఆమోదించిన తర్వాత, issued surveyor certificate విభాగంలో సర్వేయర్ సర్టిఫికెట్ రూపొందుతుంది. అక్కడ నుంచి డౌన్లోడు చేసుకోవచ్చు.


