నేటి నుంచి పీసా మహోత్సవ్
సీతంపేట: పీసా(పీఈఎస్‌ఏ–ది పంచాయత్స్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్) 1996 చట్టం వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 23, 24వ తేదీల్లో అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో పీసా మహోత్సవ్ నిర్వహించనున్నట్లు కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ మక్తా శేఖర్, ఏపీ పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణతేజ వెల్లడించారు. పది రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది క్రీడాకారులు విచ్చేస్తున్నారని, వారి భాగస్వామ్యంతో కబడ్డీ, ఆర్చరీ పోటీలు, గిరిజన సంస్కృతులను, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సోమవారం పోర్టు స్టేడియంలో విలేకరులతో వారు మాట్లాడుతూ మంగళవారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో 10కె పీసా రన్ జరుగుతుందని, అనంతరం 9 గంటలకు పోర్టు ఇండోర్ స్టేడియంలో కబడ్డీ సెమీఫైనల్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని తెలిపారు. 10 గంటల నుంచి క్రికెట్ స్టేడియంలో మహిళలు, పురుషుల జట్ల ఆధ్వర్యంలో ఆర్చరీ పోటీలు జరుగుతాయని వివరించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి క్రీడాకారులు, అధికారులు, గిరిజన ప్రజల ఆధ్వర్యంలో డెమో క్రీడాపోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. 24వ తేదీ 11 గంటల నుంచి కళావాణి స్టేడియంలో వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయన్నారు. కార్యక్రమాల్లో భాగంగా గిరిజనులు తయారు చేసిన వివిధ రకాల వస్తువులతో కూడిన స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముందుగా పీసా మహోత్సవ్ మస్కట్ కృష్ణ జింక, పీసా రన్ టీషర్టులను ఆవిష్కరించడంతో పాటు, మహోత్సవ్ బెలూన్‌ను ఎగుర వేశారు.


