రూ.2 లక్షలకే.. రైల్వే ఉద్యోగం! | - | Sakshi
Sakshi News home page

రూ.2 లక్షలకే.. రైల్వే ఉద్యోగం!

Dec 23 2025 6:46 AM | Updated on Dec 23 2025 6:46 AM

రూ.2 లక్షలకే.. రైల్వే ఉద్యోగం!

రూ.2 లక్షలకే.. రైల్వే ఉద్యోగం!

రైల్వే ఉద్యోగుల సహకారంతో నిరుద్యోగులకు వల వేస్తున్న దళారులు గేట్‌మెన్‌, పెట్రోలింగ్‌ ఉద్యోగాలున్నాయంటూ మోసం థర్డ్‌ పార్టీ ద్వారా నియామకాలుంటాయంటూ ఎర పట్టించుకోని వాల్తేరు డివిజన్‌ అధికారులు

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల పేరిట దళారుల దగ

సాక్షి, విశాఖపట్నం : వాల్తేరు డివిజన్‌ పరిధిలో రైల్వే ఉద్యోగాలు అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ఇప్పిస్తామంటూ దళారులు గాలం వేస్తున్నారు. ప్రస్తుతం గేట్‌మెన్‌, పెట్రోలింగ్‌ విభాగంలో థర్డ్‌ పార్టీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తున్నారంటూ నిరుద్యోగులకు నమ్మబలుకుతున్నారు. ఈ పోస్టుల్లో చేరిన తర్వాత భవిష్యత్తులో రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా పోస్టుల భర్తీ అయితే.. పని అనుభవాన్ని బట్టి.. ఉద్యోగం పొందవచ్చంటూ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని నిరుద్యోగులను దళారులు టార్గెట్‌ చేశారు. ఏ పోస్టుకై నా రూ.2 లక్షలు చెల్లిస్తే చాలనీ.. మిగిలిందంతా తాము చూసుకుంటామంటూ ఎరవేస్తున్నారు. థర్డ్‌ పార్టీ ద్వారా అవుట్‌ సోర్సింగ్‌లో చేరినా రూ.40 నుంచి రూ.50 వేలకు పైగా జీతం వస్తుందని చెబుతున్నారు. ప్రతి ఏటా రెన్యువల్‌ అవుతుంటుందనీ.. అప్పుడు రూ.50 వేలు లేదా రూ.లక్ష చెల్లిస్తే చాలనీ.. మళ్లీ మరో ఏడాది పాటు ఉద్యోగానికి ఎలాంటి ఢోకా ఉండబోదని చెబుతున్నారు.

ఉద్యోగుల పేరుతో మోసాలు..!

తమకు వాల్తేరు రైల్వే డివిజన్‌లో ఉన్నతాధికారులు తెలుసు అంటూ ఈ దళారులు నమ్మిస్తున్నారు. వారితో మాట్లాడించినట్లుగా చూపిస్తూ దందాకు తెర తీస్తున్నారు. అయితే.. కొందరు ఉద్యోగులు మాత్రం దళారీ ఫోన్‌ చేసినప్పుడు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు తీస్తున్నారనీ చెప్పి కొంత మేర కమీషన్‌ ముట్టేలా బేరసారాలు చేసుకున్నట్లు సమాచారం. ఇలా దళారుల నుంచి ఫోన్‌ రాగానే.. మాటామాటా కలిపి పోస్టులు భర్తీ వేగంగా జరుగుతోందనీ.. త్వరగా మీ వాళ్లెవరైనా ఉంటే.. మాట్లాడుకోవాలని చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వయంగా రైల్వే ఉద్యోగులే చెబుతున్నప్పుడు, ఈ పోస్టులు నిజమేనని భావించిన నిరుద్యోగులు దళారీల చేతుల్లో డబ్బులు పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువ మంది నుంచి వసూలు చేసినట్లు సమాచారం. విశాఖపట్నంలోనూ ఇప్పుడిప్పుడే ఈ తరహా మోసాలు మొదలయ్యాయని తెలుస్తోంది.

డివిజన్‌ అధికారులూ స్పందించరా..

ఈ విషయం వాల్తేరు రైల్వే డివిజన్‌ అధికారులకు తెలిసినా తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిరుద్యోగులు మోసానికి గురవుతున్నా స్పందించడం లేదు. వాస్తవానికి డివిజన్‌లో థర్డ్‌ పార్టీ ద్వారా హౌస్‌కీపింగ్‌, సెక్యూరిటీ, డేటాఎంట్రీ పోస్టుల భర్తీకి మాత్రమే ఇటీవల టెండర్లు పిలిచారు. ఏడాది కాలం ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులు భర్తీ చేయనున్నారు. కానీ గేట్‌మెన్‌, పెట్రోలింగ్‌ పోస్టులకు ఎలాంటి టెండర్లు పిలవకపోయినా.. నిరుద్యోగులను టార్గెట్‌గా చేసుకుంటూ కొందరు దళారులు రూ.లక్షలు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇప్పటికై నా డివిజన్‌ అధికారులు ఈ పోస్టుల భర్తీపై పారదర్శకంగా వ్యవహరించి.. సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

‘రండి బాబూ.. రండి.. ఆలోచించిన ఆశాభంగం.. కేంద్ర ప్రభుత్వ కొలువులిస్తాం. పోటీ ఎక్కువగా ఉంది. అవుట్‌ సోర్సింగ్‌ అయినా.. అదిరిపోయే ఉద్యోగం. కేవలం రూ.2 లక్షలు మాత్రమే చెల్లించండి.. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం పొందండి..’ అంటూ నిరుద్యోగులను కొందరు కేటుగాళ్లు మోసం చేస్తున్నారు. వాల్తేరు డివిజన్‌ పరిధిలో ఈ తరహా కొత్త మోసం మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement