అదే అక్కసు
వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వైఎస్సార్‌సీపీ చేరికల కార్యక్రమం అడ్డగింత సోమవారం ఉదయం ఎరీనా గేట్‌కు తాళం వేసిన పోలీసులు గేటు ముందే బైఠాయించిన వైఎస్సార్ సీపీ నేతలు అక్కడే వైఎస్సార్ సీపీలో 1,400 మంది చేరిక
సాక్షి, విశాఖపట్నం : చంద్రబాబు సర్కార్ అధికారులను అడ్డుపెట్టుకొని వైఎస్సార్‌సీపీపై కుట్రలు చేస్తోంది. నేరుగా ఎదుర్కొనలేక తెర వెనుక కుతంత్రాలకు తెర తీస్తోంది. సోమవారం వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీలో చేరికల కార్యక్రమాన్ని అడ్డుకోంది. ఈ కార్యక్రమం కోసం వైఎస్సార్‌సీపీ నేతలు ముందుగానే వీఎంఆర్‌డీఏకి రూ.71,300 చెల్లించి అధికారికంగా అనుమతి తీసుకున్నారు. విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో ప్రముఖ నేత ధర్మాన ఆనంద్ నేతృత్వంలో బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీకి చెందిన 1,400 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరేందుకు వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్ ఎరీనా వద్దకు సోమవారం ఉదయం చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీలో భారీ చేరికలని తెలుసుకొన్న చంద్రబాబు ప్రభుత్వం అనుమతి లేదంటూ పోలీసుల అండతో చిల్డ్రన్స్ ఎరీనా సిబ్బందితో గేటుకు తాళం వేయించింది. ఈ ఘటనను నిరసిస్తూ వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, సమన్వయకర్త మొల్లి అప్పారావు, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర మత్స్యకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్యనేతలు చిల్డ్రన్ ఎరీనా గేటు వద్ద రెండు గంటలపాటు బైఠాయించారు. అక్కడ నుంచి సిరిపురం సర్కిల్ వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. వైఎస్సార్‌సీపీ చేరికల కార్యక్రమం అడ్డగింతపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికలు
చిల్డ్రన్స్ ఎరీనా గేటు వద్ద ప్రముఖ నేత ధర్మాన ఆనంద్ నేతృత్వంలో కొత్తపల్లి రవిరాజు వర్మ, బొడ్డూరి వాసుదేవరావు, రాయపల్లి ప్రకాష్, రాయపల్లి రాజారావు, వి.వి.రామారావు, పొలిమాటి అశోక్‌కుమార్, పొలిమాటి నవీన్, దాకే రమేష్‌బాబు, దాకే వినూత్న, కొత్తపల్లి వీరస్వామి, గుర్ల కిరణ్‌కుమార్, డి.ఆకాంక్షతో పాటు బీజేపీ, కాంగ్రెస్, జనసేన, టీడీపీకి చెందిన 1,400 మంది కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరారు. పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, డిప్యూటీ మేయర్ కె.సతీష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, రాష్ట్ర మత్సకార విభాగం అధ్యక్షుడు పేర్ల విజయచందర్ వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ధర్మాన ఆనంద్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అందించిన సంక్షేమ పథకాలు పొందిన తామంతా.. గత ఎన్నికల్లో కూటమి పార్టీల అబద్దాలను నమ్మి ఓట్లు వేసి మోసపోయామన్నారు. మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డినే ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని వైఎస్సార్‌సీపీలో చేరామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ అనిల్‌కుమార్ రాజు, పార్టీ ముఖ్య నాయకులు అల్లంపల్లి రాజబాబు, పీపీ నారాయణ, చొక్కర శేఖర్, ఎం.సునీల్, బెవర జగదీష్, పీతల వాసు, కనక ఈశ్వరరావు, శివారెడ్డి, సీహెచ్ నాగేశ్వరరావు, ఎం.ప్రదీప్, పోతిన హరికృష్ణ, నూకరాజు, నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అదే అక్కసు


