కేఎంఆర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని ఆందోళన
మధురవాడ: ఫేక్ హాల్ టికెట్లు ఇచ్చి విద్యార్థులను మోసం చేసిన కేఎంఆర్ కళాశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి యు. నాగరాజు డిమాండ్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఐదుగురు విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆర్‌ఐవో సమగ్ర విచారణ జరిపించాలని, బాధిత విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు. ప్రైవేట్ కళాశాలలు విద్యను వ్యాపారంగా మార్చేశాయని ఆయన విమర్శించారు.
ఏబీవీపీ నిరసన : కేఎంఆర్ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ఐదుగురు విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడిందని ఏబీవీపీ నాయకులు ఆరోపించారు. ఎంసెట్ ఆశలు నీరుగారిపోవడంతో మంగళవారం కళాశాల వద్ద వారు నిరసన తెలిపారు. ప్రైవేట్ కళాశాలల ఇష్టారాజ్య పాలనను అధికారులు పట్టించుకోవడం లేదని వారు విమర్శించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆర్‌ఐవోను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.


