ఫైలు కదలాలంటేపైసలివ్వాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

ఫైలు కదలాలంటేపైసలివ్వాల్సిందే!

May 28 2025 5:55 PM | Updated on May 28 2025 5:55 PM

ఫైలు

ఫైలు కదలాలంటేపైసలివ్వాల్సిందే!

● లేఅవుట్ల అనుమతికి ముప్పుతిప్పలు ● ఎకరాకు ఇంత అని ముట్టజెప్పాల్సిందే.. ● ఇంజినీరింగ్‌లో పర్సంటేజీలు ● అకౌంట్స్‌లోనూ అదే తీరు.. ● కాంట్రాక్టులను పంచుకుంటున్న అధికారులు

అకౌంట్స్‌లో చెక్కులకు మామూళ్లు

సంబంధిత విభాగాల్లో అధికారుల ఆమోద ముద్ర తరువాత పైళ్లు చివరిగా పేమెంట్‌ కోసం అకౌంట్స్‌ విభాగానికి వెళతాయి. అక్కడ ఒక కాంట్రాక్టర్ల బిల్లులే కాకుండా వీఎంఆర్‌డీఏ చేసే చెల్లింపులన్నింటికీ శల్యపరీక్షలు జరుగుతాయి. ఈ విభాగంలో బిల్లుల చెల్లింపులకు జాప్యం సర్వసాధారణమన్న టాక్‌ వినిపిస్తోంది. చెక్కులు చేతికందాలంటే మామూళ్లు సమర్పించుకోవాలన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు అటవీ విభాగంలో కూడా పనుల కేటాయింపులో అవకతవకలు జరుగుతున్నాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. సిబ్బందిలోనే కొందరు బినామీ కాంట్రాక్టర్ల ద్వారా పనులు చేజిక్కించుకుని భారీగానే వెనకేసుకుంటున్నారని విభాగం సిబ్బందే చెవులు కొరుక్కుంటున్నారు. ఇలా వీఎంఆర్‌డీఏలో ఒక్కో విభాగంపై ఒక్కో రకమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

విశాఖ సిటీ: అక్కడ ఫైలు కదలాలంటే పైసలివ్వాల్సిందే. లేదంటే వారాలు, నెలలు గడిచినా ముందుకు కదలదు. ఈ విభాగం.. ఆ విభాగం.. అని తేడా లేదు. అన్నింట్లోను అదే పరిస్థితి. ఎక్కడైనా.. ఏ పనికై నా మామూళ్లు ముట్టజెప్పాల్సిందే. లేదంటే లేఅవుట్లకు అనుమతులు రావు. ఇంజినీరింగ్‌లో బిల్లులు మంజూరు కావు. అకౌంట్స్‌లో చెక్కులు అవ్వవు. ఇదీ విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(వీఎంఆర్‌డీఏ)లో దుస్థితి. ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, అకౌంట్స్‌, ఫారెస్ట్‌ ఇలా ఏ విభాగంలో పని పూర్తి కావాలన్నా అధికారుల చేతులు తడపాల్సిందే అన్నది బహిరంగ రహస్యమే.

అంతా ‘ప్లానింగ్‌’ ప్రకారమే..

వీఎంఆర్‌డీఏలో అంతా ఒక ‘ప్లానింగ్‌’ ప్రకారమే చక్కబెట్టేస్తున్నారు. సంస్థ పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి కోసం రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు ప్లానింగ్‌ విభాగంలో దరఖాస్తులు చేస్తాయి. వీటికి అనుమతులు ఇవ్వాలంటే విభాగంలో పలువురి చేతులు తడపాల్సిందే. ఫైలు కదలాలంటే ఎకరాకు ఇంత అని అనధికార చెల్లింపులు చదివించుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. విస్తీర్ణం, ప్రాంతాన్ని బట్టి ఈ రేటు మారుతూ ఉంటుంది. ప్లానింగ్‌ ఆఫీసర్‌ నుంచి సర్వేయర్‌ వరకు అంతా ఏకమైపోతారు. డబ్బులు ముట్టిన ఫైళ్లను మాత్రమే క్లియరెన్స్‌కు పంపుతారు. రేటు నిర్ణయం కాని వాటిని ముట్టుకోరు. ఒకవేళ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువు దాటిన తరువాత వాటికి ఆటోమేటిక్‌గా అనుమతి లభించినప్పటికీ.. కొర్రీలు వేస్తూ ముప్పుతిప్పలు పెడతారు. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం మందగించింది. దీంతో వీఎంఆర్‌డీఏ పరిధిలో కొత్త లే అవుట్లకు దరఖాస్తులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం మూడు వరకు మాత్రమే లేఅవుట్ల కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇవి ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి.

వీఎంఆర్‌డీఏలో ఎక్కడి ఫైళ్లు అక్కడే..

పర్సంటేజీల్లో కింగ్‌.. ఇంజినీరింగ్‌

వీఎంఆర్‌డీఏలో ఇంజినీరింగ్‌ విభాగం అత్యంత కీలకం. రూ.వందల కోట్లతో జరిగే పనులను ఈ విభాగమే పర్యవేక్షిస్తుంది. దీంతో ఈ విభాగంలో పోస్టింగ్‌లకు భలే గిరాకీ ఉంది. జగనన్న లేఅవుట్ల అభివృద్ధి, మాస్టర్‌ ప్లాన్‌ రహదారులు, ది డెక్‌ వాణిజ్య సముదాయం.. ఇలా అనేక భారీ ప్రాజెక్టు పనులను ఈ విభాగం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అలాగే మౌలిక సదుపాయాల పనులను రూ.వందల కోట్ల వీఎంఆర్‌డీఏ నిధులతో చేపడుతున్నారు. వీటితో పాటు వీఎంఆర్‌డీఏ మ్యూజియాలు, పర్యాటక కేంద్రాల నిర్వహణ, నిర్మాణ టెండర్లతో బిజీగా ఉన్నారు. టెండర్లు దక్కించుకున్న నాటి నుంచి కాంట్రాక్టర్లకు పర్సంటేజీ బెదడ ప్రారంభమవుతుంది. వారు చేసిన పనులన్నీ ఎప్పటికప్పుడు ఫీల్డ్‌ మెజర్‌మెంట్‌ పుస్తకంలో నమోదు చేస్తేనే వాటికి బిల్లులు మంజూరవుతాయి. దీనికి ఇంజినీరింగ్‌ అధికారులకు పర్సంటేజీలు తప్పనిసరి. లేనిపక్షంలో ఆ బిల్లుల ఫైల్‌ మాయమైపోతుంది. కాంట్రాక్టర్‌ ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫైల్‌ కనిపించదు. పర్సంటేజ్‌ ఇచ్చిన వెంటనే బిల్లు ఉన్నతాధికారులకు వెళ్లిపోతుంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో టెండర్ల వ్యవహారంపై కూడా దుమారం రేగుతోంది. తమ వారికి పనులు అప్పగించేందుకు టెండర్ల సమయంలోనే కాంట్రాక్టర్లకు ఫోన్‌ చేసి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి.

ఫైలు కదలాలంటేపైసలివ్వాల్సిందే! 1
1/1

ఫైలు కదలాలంటేపైసలివ్వాల్సిందే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement