భక్తులకు అష్టకష్టాలు
ఘాట్‌రోడ్డు వరకు బారులు తీరిన భక్తులు
సింహచలం/పెందుర్తి: సింహాచలేశుడి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు అష్టకష్టాలు పడ్డారు. కూటమి ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. సామాన్య భక్తులకు సరిపడా బస్సుల్ని నడపంలో నిర్లక్ష్యం చూపిన అధికార యంత్రాంగం, తమ వారికి మాత్రం విచ్చలవిడిగా కారు పాసులు మంజూరు చేసింది. పోలీసులు కూడా తమ బంధువుల్ని ఇష్టారీతిన నేరుగా దర్శనానికి తీసుకెళ్లి సామాన్య భక్తులకు నరకం చూపడంలో తమను మించినవారు లేరని నిరూపించుకున్నారు.
అడుగు అడుగునా నరకం
శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి నిజరూప దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా నుంచి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. కొండ దిగువ నుంచి సింహగిరికి చేరుకునే క్రమంలో వేలాది మంది భక్తులు నరకాన్ని చవిచూశారు. భక్తులకు సరిపడా బస్సులు నడపడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. సాధారణ సమయంలో కొండ దిగువ నుంచి 15–20 నిమిషాల్లో చేరుకోవచ్చు. కానీ చందనోత్సవాన భక్తులు కింద నుంచి సింహగిరికి చేరుకోవడానికి సగటున నాలుగైదు గంటల సుదీర్ఘ సమయం పట్టింది. కొండ దిగువన ఇటు గోశాల వద్ద, అటు అడవివరం కూడలి వద్ద గంటల తరబడి నిరీక్షించాల్సిన దుస్థితి. బస్ ఎక్కేందుకు దాదాపు 2 గంటలు, సింహగిరి పైకి చేరుకునేందుకు మరో రెండు మూడు గంటల సమయం పట్టిందని వేలాది భక్తులు వాపోయారు. కిక్కిరిసిన బస్సుల వెంట జనం పరుగులు పెట్టారు. కింద నుంచి కొండ మీద వరకు మహిళలు సైతం వేలాడుతూ ప్రయాణించారు. దర్శనం తర్వాత ఇంటి ముఖం పట్టేందుకూ ఇదే నరకాన్ని ప్రభుత్వం చూపింది.
ఘాట్ రోడ్‌లో కిలోమీటర్ పైగా క్యూ
ఉదయం 11 తరువాత భక్తుల తాకిడి అమాంతం పెరిగిపోయింది. అప్పటివరకు లోవతోట వైపు ఉన్న ఉచిత క్యూలో మాత్రమే భక్తులు ఉండగా.. ఒక్కసారిగా భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో పోలీసులు క్యూను ఘాట్ రోడ్‌కు మళ్లించారు. దీంతో ఘాట్ రోడ్‌లో నిమిషాల్లో క్యూ కిలోమీటరు దాటిపోయింది. ఆర్టీసీ బస్సుల్లో వచ్చిన చాలామంది భక్తులు సింహగిరి బస్టాండ్ వద్ద దిగి, తిరిగి ఘాట్ రోడ్డు క్యూకి చేరుకోవడానికి కిలో మీటర్‌పైగా వెనక్కి నడవాల్సి వచ్చింది. క్యూ లైన్‌లో చేరిన నుంచి స్వామి దర్శనం చేసుకుని తిరుగుముఖం పట్టేందుకు 5 నుంచి 8 గంటల సమయం పట్టింది. బ్రహ్మోత్సవాల సమయంలో తిరుపతి వెంకన్న దర్శనానికి కూడా ఇంత సమయం పట్టింది లేదని కొందరు భక్తులు ఆవేదన వెళ్లగక్కారు. కూటమి నేతలు, అధికారులు, పోలీసుల కుటుంబాలు మాత్రం నిమిషాల వ్యవధిలోనే తమ కళ్లముందే దర్జాగా దర్శనం చేసుకుని వెళ్లిపోయారని ఆక్షేపించారు.
కొండ పైకి వెళ్లే బస్సు ఎక్కేందుకే
గంటల తరబడి పడిగాపులు
దర్శనానికి 5 నుంచి 8 గంటల పాటు
క్యూల్లో నరకయాతన
కొండపైకి విచ్చలవిడిగా కారు పాసులు
భక్తులను గాలికి వదిలేశారు
బస్ ఎక్కడానికి క్యూ పద్ధతి పాటించాలన్నారు. దర్శనం అయ్యాక ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తిరుగు ప్రయాణంలో బస్ ఎక్కడానికి దాదాపు 2 గంటలకు పైగా వేచి వుండాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్యం దారుణం.
– కల్యాణి, సోంపేట, శ్రీకాకుళం
తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం
కొండపైకి ప్రైవేటు వాహనాలు అనుమతించలేదు. దీంతో దేవస్థానం ఏర్పాటు చేసిన బస్సును ఆశ్రయించాం. గంటన్నర పాటు బస్సు కోసం ఉన్న తరువాత.. కొండపైకి చేరడానికి మరో మూడు గంటలు పట్టింది.
– నారాయణరావు, నర్సారావుపేట
భక్తులకు అష్టకష్టాలు
భక్తులకు అష్టకష్టాలు
భక్తులకు అష్టకష్టాలు
భక్తులకు అష్టకష్టాలు


