విశాఖ లీగల్ : వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసేందుకు యత్నించిన నిందితునికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ నగరంలోని రెండో అదనపు జిల్లా న్యాయస్థానం న్యాయమూర్తి ఎం.వెంకటరమణ శుక్రవారం తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ఇన్‌చార్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాండ్రేగుల జగదీశ్వరరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు డోలా సాయి (23) నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొబ్బరితోట నివాసి. రౌడీ షీటర్‌గా స్థానికంగా పెత్తనం చెలాయించేవాడు. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న సాయి... ఆ బంధానికి సదరు మహిళ భర్త అడ్డం వస్తున్నాడని పలుమార్లు అతడిని హెచ్చరించాడు. అయినా మాట వినకపోవడంతో 2018 అక్టోబర్ 20న అతని మెడపై కత్తితో సాయి బలంగా గాయపరిచాడు. బాధితుని ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు డోలా సాయిపై కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు చెప్పారు.