విశాఖపై చెరగని సంతకం | Sakshi
Sakshi News home page

విశాఖపై చెరగని సంతకం

Published Sat, Jul 8 2023 12:48 AM

- - Sakshi

ఆయన చూపులు... సుదీర్ఘ పరిచయపు చిరునవ్వును చిందిస్తూ, అందరి వైపూ ఆత్మీయంగా ప్రసరిస్తాయి.

ఆయన చేతులు... సదా ఏదో ఇవ్వడానికే తామున్నట్టు ఓ ఆత్మీయ స్పర్శో, చల్లని దీవెనో కురిపిస్తుంటాయి.

ఆయన పాదాలు.. ఆపన్నుల్ని ఆదుకునేందుకు, బడుగుల బతుక్కి కొత్త భరోసా ఇచ్చేందుకు నిరంతరం తపిస్తుంటాయి.

ఆయన తెలుగునాట గుండె కింద ఆరని తడి.. ఏళ్లు గడిచినా మరపురాని జ్ఞాపకాల జడి...

సాక్షి, విశాఖపట్నం : మహానేత వైఎస్సార్‌ మానస పుత్రికగా విశాఖ నగరం ఉజ్వలంగా వెలుగొందింది. ప్రతి రంగంలోనూ ప్రగతికి బాటలు వేసి.. పల్లె, పట్టణమని తేడా లేకుండా ఉమ్మడి విశాఖ జిల్లాలో అభివృద్ధికి నాంది పలికారాయన. లెక్కలేనన్ని ప్రతిపాదనలకు కార్యరూపమిచ్చారు. అభ్యున్నతికి ఆలంబనగా సాగిన వైఎస్సార్‌ పాలనలో విశాఖ.. సరికొత్తగా ఆవిష్కృతమైంది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యపు కోరల్లో పాలన సాగించడంతో.. ప్రగతి గతి తప్పి.. విశాఖ వైభవానికి చెదలు పట్టాయి. ముఖ్యమంత్రిగా 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. విశాఖ నగరం విశ్వనగరంగా దూసుకుపోతోంది. త్వరలో పరిపాలనా రాజధాని కానుంది. శనివారం వైఎస్సార్‌ జయంతి సందర్భంగా రాజన్న చేపట్టిన అభివృద్ధి.. సంక్షేమాలను గుర్తు చేసుకుందాం.

దేశంలోని టాప్‌ నగరాల్లో ఒకటిగా
దేశంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం అమలైన 63 నగరాల్లో వైజాగ్‌ను చేర్చిన ఘనత వైఎస్సార్‌దే. జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ పునర్ని ర్మాణ పథకం (జెఎన్‌ఎన్‌యూఆర్‌ఎం)లో విశాఖ నగరాన్ని చేర్పించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతో నగరానికి రూ.1,885 కోట్ల విలువైన పనులు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ వాటా 20 శాతం కూడా ఎప్పటికప్పుడు జీవీఎంసీకి అందజేసేలా చర్యలు తీసుకున్నారు. సింహాచలం, పెందుర్తి బీఆర్‌టీఎస్‌ కారిడార్లు, ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్‌, విలీన గ్రామాలకు తాగునీటి సౌకర్యంతోపాటు భూగర్భ మురుగు నీటి వ్యవస్థ, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన 20 ప్రాజెక్టులను వైఎస్సార్‌ తీసుకొచ్చారు. సెంట్రల్‌ సిటీలో రూ.244 కోట్లతో 750 కి.మీ మేర యూజీడీ పనులు చేపట్టారు.

యువతకు ఉపాధి... భవితకు పునాది
2008 జనవరి 2వ తేదీన ఉపాధి పథకాన్ని వైఎస్సార్‌ ప్రారంభించారు. రూ.5 కోట్లను కేటాయిస్తూ 18–35 ఏళ్ల మధ్య వయసున్న యువతకు 13 అంశాల్లో శిక్షణ ఇచ్చి, ఆ శిక్షణ సంస్థల ద్వారానే 70 శాతం వరకూ ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. హౌస్‌ కీపింగ్‌, సెక్యూరిటీ గార్డ్స్‌, సర్ఫేస్‌ ఆర్నమెంట్స్‌.. మొదలైన అంశాల్లో శిక్షణ తీసుకొని ఉపాధి పొందిన వారెందరో ఉన్నారు. ఆయన మరణించిన తర్వాత ఈ పథకాన్ని పూర్తిగా విస్మరించేశారు. మళ్లీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలలకే.. సచివాలయ వ్యవస్థను రూపొందించి 4 లక్షలకు పైగా ఉద్యోగాలను అందించారు.

అంతర్జాతీయ హోదా ఆయన ఘనతే...
హైదరాబాద్‌కే పరిమితమైన అంతర్జాతీయ విమానాశ్రయ సర్వీసులను విశాఖ ప్రజలకూ పరిచ యం చెయ్యాలని వైఎస్సార్‌ సంకల్పించారు. అనుకున్నదే తడవుగా రూ.100 కోట్లు వెచ్చించి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో విమానయాన సంస్థలకు అందించాల్సి న రాయితీలు చెల్లించకపోవడంతో అనేక సర్వీసులు నిలిచిపోయాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో మళ్లీ సర్వీసులు మొదలయ్యాయి. అంతే కాకుండా మొదటి సారిగా.. విశాఖ నుంచి సరకు రవాణా కోసం కార్గో సర్వీసు కూడా ప్రారంభమైంది. ఇటీవల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శంకుస్థాపన కూడా చేశారు.

విశాఖ ఐటీకి జీవం..
ఐటీ ప్రగతి ఒక్క హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వికేంద్రీకరణ జరగాలని వైఎస్సార్‌ భావించారు. విశాఖలో ఐటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టా రు. విశాఖలో మూడు కొండల్ని, కొండల కింద ఉన్న సుమారు 100 ఎకరాల పల్లపు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. కనీసం 100 మందికి ఉద్యోగావకాశాలు కల్పించే ఐటీ కంపెనీలకు మాత్రమే అవకాశమిచ్చి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు ప్లాట్లుగా డివైడ్‌ చేసి అందించారు. వైఎస్‌ ఆలోచనలను మెచ్చి సుమారు 200 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇందులో కొద్ది కాలంలోనే 70 శాతం కంపెనీలు కార్యకలాపాల్ని ప్రారంభించాయి. సత్యం, విప్రో కంపెనీలూ విశాఖలోనూ శాఖలను విస్తరించాయి. వైఎస్సార్‌ మరణం తర్వాత.. ఆయనతోపాటే ఐటీ గ్రాఫ్‌ కూడా కనుమరుగైపోయింది. ఎగుమతులు పడిపోయాయి. టీడీపీ హయాంలో ఒక్కొక్క కంపెనీ వెనక్కు వెళ్లిపోయాయి. దాదాపు పదేళ్లు విశాఖ ప్ర‘గతి’ తప్పింది. మళ్లీ 2019లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఐటీ రంగం పరుగులు పెడుతోంది. విశాఖ నగరంలో ఇన్ఫోసిస్‌ కార్యకాలపాలకు సిద్ధమైంది. డేటా ఆదాని సెంటర్‌ శంకుస్థాపన జరిగింది. దీంతో విశాఖ ఐటీ కళ సంతరించుకుంది.

విమ్స్‌ ఆయన చలవే..
ఉత్తరాంధ్ర ప్రజలకు హైదరాబాద్‌ నిమ్స్‌ తరహాలో అత్యుత్తమ సేవలు అందించేందుకు విమ్స్‌కు 2006లో వైఎస్సార్‌ శ్రీకారం చుట్టారు. 1,130 పడకలు, 21 సూపర్‌ సెషాలిటీ బ్లాకులతో రూ.250 కోట్లతో విమ్స్‌ ఆస్పత్రికి 2007లో శంకుస్థాపన చేశారు. 2009 డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. వైఎస్సార్‌ మృతిచెందాక విమ్స్‌ని ఆ తరువాత వచ్చిన ప్రభు త్వాలు పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం విమ్స్‌ని ప్రైవేట్‌ పరం చేసేందుకు కుయుక్తులు పన్నింది. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఈ ప్రయతాన్ని అడ్డుకుంది. గతంలో కోవిడ్‌ సమయంలో విమ్స్‌ని స్టేట్‌ కోవిడ్‌ హాస్పిటల్‌గా మార్చింది. ప్రస్తుతం అటు విమ్స్‌, ఇటు కేజీహెచ్‌ రోగులకు అత్యుత్తమ సేవలందిస్తున్నాయి.

గ్రేటర్‌ హోదా కల్పించి..
ఏళ్ల తరబడి వాయిదాలు పడిన మహా విశాఖ ప్రతిపాదనలు వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే ఫలించాయి. విశాఖ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు 2005 నవంబర్‌ 22న జీవీఎంసీకి గ్రేటర్‌ హోదా కల్పిం చారు. అప్పటి వరకూ 111 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న విశాఖ 540 చ.కి.మీ విస్తీర్ణంతో మహా విశాఖగా అవతరించింది. 2013లో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలని విలీనం చేయగా ప్రస్తుతం 681.96 చ.కి.మీ.లకు విస్తరించింది. 72 వార్డులతో ఉన్న జీవీఎంసీని విస్తరిస్తూ 81 వార్డులు ఏర్పాటు చేస్తామంటూ టీడీపీ ప్రభుత్వం హడావుడి చేసి విస్మరించింది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. జీవీఎంసీ వార్డుల విస్తరణపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. మరో 10 పంచాయతీలను గ్రేటర్‌లో విలీనం చేస్తూ.. ప్రస్తుతం 98 వార్డులుగా మార్చారు.

మహా నగరంలో పర్యటించిన ప్రతిసారీ.. నిరుపేదలను చూసి చలించిపోయిన వైఎస్సార్‌.. వారికో గూడు కల్పించాలని నిర్ణయించుకున్నారు. రాజీవ్‌ గృహకల్ప ఇళ్లకు శ్రీకారం చుట్టారు. విశాఖ నగర పరిధిలో సుమారు లక్షకుపైగా పునరావాస, పూర్‌ సెటిల్‌మెంట్‌ కాలనీలు నిర్మించారు. రాజీవ్‌ గృహకల్ప ద్వారా రూ.650 కోట్లతో 15,320 ఇళ్లు, జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా 600 కోట్లతో 15 వేల గృహాలు, వాంబే కింద రూ.400 కోట్లతో 9 వేల ఇళ్ల నిర్మించారు. మధురవాడలో గృహ సముదాయాలు ఆయన చేతుల మీదుగానే ప్రారంభమయ్యాయి.

1/2

మహానేత కాంస్య విగ్రహం
2/2

మహానేత కాంస్య విగ్రహం

Advertisement

తప్పక చదవండి

Advertisement