ఇసుక అక్రమ డంపులపై కొరడా | - | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ డంపులపై కొరడా

Nov 17 2026 8:17 AM | Updated on Nov 17 2026 8:17 AM

హుడాకాంప్లెక్స్‌: ఇసుక అక్రమ డంపులపై జిల్లా మైనింగ్‌ శాఖ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. కొంతమంది వ్యాపారులు గోదావరి, కొత్తగూడెం, కాళేశ్వరం, భద్రాచలం, మూసీనది వాగుల నుంచి ఇసుకను అక్రమంగా లారీల్లో తరలించి ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లో గుట్టుగా నిల్వ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం ఉదయం మైనింగ్‌శాఖ అధికారులు రెవెన్యూ, పోలీసు అధికారులతో కలిసి ఆటోనగర్‌, సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడి యం సమీపంలోని డంపులపై దాడులు చేశారు. అధిక ధరలకు ఇసుక అమ్ముతున్నట్లు గుర్తించారు.

చిరువ్యాపారుల్లో ఆందోళన

అధికారులు వాహనాలను సీజ్‌ చేసేందుకు యత్నించగా వ్యాపారులు అడ్డుకున్నారు. తాము నిల్వ చేసింది అక్రమ ఇసుక కాదని, ప్రభుత్వ రీచ్‌ల నుంచి కొనుగోలు చేసిందని వాదించారు. ఇదే ఇసుకను తాము చిల్లరగా అమ్ముకుంటూ జీవిస్తున్నామని చిరు వ్యాపారులు స్పష్టం చేశారు. దీంతో అధికారులు కొంత వెనక్కి తగ్గారు. డంపుల్లో నిల్వ ఉన్న ఇసుకను ఖాళీ చేసేందుకు రెండు రోజుల గడువు ఇచ్చి వెళ్లారు. అధికారుల దాడులతో ఇప్పటి వరకు ఆటోలు, ట్రాక్టర్లు, ఇతర చిన్న వాహనాల్లో ఇసుకను అమ్ముతున్న చిరువ్యాపారుల్లో ఆందోళన మొదలైంది.

మైనింగ్‌, రెవెన్యూ, పోలీసుశాఖల ఆధ్వర్యంలో సంయుక్త దాడులు

పలు వాహనాలు సీజ్‌.. అడ్డుకున్న వ్యాపారులు

రెండు రోజుల గడువిచ్చిన అధికారులు

అక్రమ వ్యాపారం సహించం

ప్రభుత్వం ప్రజలకు సరసమైన ధరలకే ఇసుకను సరఫరా చేయాలని భావించింది. ఆ మేరకు శాండ్‌ బజార్లను ఏర్పాటు చేసింది. జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్‌, ఆదిభట్ల, వట్టినాగులపల్లి, మేడ్చల్‌జిల్లా పరిధిలోని బొమ్మరాస్‌పేటలో శాండ్‌ బజార్‌లను నెలకొల్పింది. ఇక్కడ టన్ను దొడ్డు ఇసుక ధర రూ.1,600, సన్న ఇసుక ధర రూ. 1,800గా నిర్ణయించింది. ప్రైవేటుగా అధిక ధరలకు కొనుగోలు చేసి మోసపోవద్దు. అక్రమ మైనింగ్‌ వ్యాపారాన్ని అస్సలు సహించబోం.

– నర్సిరెడ్డి, ఏడీ, మైన్స్‌ రంగారెడ్డి జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement