టెండర్ పద్ధతిన పనులు కేటాయించకపోవడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్ల అభ్యంతరం వాడీవేడిగా సాగిన కౌన్సిల్ సమావేశం ఏడు అంశాలకుఆమోదం తెలిపిన సభ్యులు
తాండూరు: టెండర్ పద్ధతిలో చేపట్టాల్సిన పనుల ను నామినేషన్ విధానంలో చేయడంపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం తాండూరు మున్సిపల్ సాధారణ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగింది. అధికారులు ఏడు అంశాలపై ఎజెండాను ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. అంతకుముందు సమావేశం వాడీవేడిగా సాగింది. టెండర్లు ఆహ్వానించకుండా పనులు ఎలా కేటాయిస్తారని బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిలదీశారు. ప్రజాధనం ఖర్చు చేసే విషయంలో పారదర్శకత పాటించాలని సూచించారు. స్వచ్ఛభారత్ పనులకు రూ.10.82 లక్షలు ఖర్చు చేయడంపై అభ్యంతరం తెలిపారు. స్పందించిన చైర్పర్సన్ కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నామినేషన్ పద్ధతిలో నిధులు వినియోగిస్తున్నట్లు తెలిపారు. అనంతరం హైమాస్ట్ లైట్ల మరమ్మతులకు రూ.10 లక్షలు, తాగునీటి సరఫరాకు రూ.5 లక్షలు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. వీధి కుక్కల సంతతి నియంత్రణకు, పండుగల ఏర్పాట్లకు సంబంధించిన నిధులకు సభ్యులు ఆమోదం తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాకేష్‌రెడ్డి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.


