ప్రయోజనాలు ఇవీ..
షాద్‌నగర్: వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరతతో పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో సరికొత్త ప్రయోగానికి విద్యుత్ శాఖ శ్రీకారం చుట్టింది. తక్కువ నీటి వినియోగంతో అధిక దిగుబడులు సాధించే దిశగా చర్యలు చేపట్టింది. నీటి పొదుపును ప్రోత్సహిస్తూ రైతులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ఖేతిరక్షక్ నెట్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించింది. షాద్‌నగర్ పరిధిలోని చించోడ్ విద్యుత్ సబ్ స్టేషన్లో రాష్ట్రంలోనే తొలి పైలెట్ ప్రాజెక్టు కింద పంటల సాగు కోసం పోర్టబుల్ నెట్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
రాష్ట్రంలోనే తొలిసారిగా..
ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తెలంగాణ ఉద్యానశాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం వారి సహకారంతో ఖేతి రక్షక్ నెట్‌హౌస్‌ను ఏర్పాటు చేస్తున్నారు. పాలీహౌస్ తరహాలో సింథటిక్ పోర్టబుల్ హౌస్‌ను ఏర్పాటు చేసి పంటల సాగుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టు కింద ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్ సబ్ స్టేషన్లో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈ నెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల విద్యుత్ శాఖ సీఎండీ జితేష్ వి.పాటిల్ ఈ నెట్‌హౌస్‌ను పరిశీలించారు. ఇది విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు. నెట్ హౌస్ కింద పంటల సాగును విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
ఏడాది పొడవునా సాగు
పాలీహౌస్ తరహాలో సింథటిక్ నెట్ వేసి రైతులు తమకు నచ్చిన పంటలు సాగు చేసుకోవచ్చు. ఆరుతడి పంటలు, కూరగాయలు, ఆకుకూరలు, పూల వంటి 20కిపైగా రకాల పంటలను సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా పండించొచ్చు. తక్కువ నీటితో పంటలు సాగు చేయడం, పంట నాణ్యతను పెంచడంతో రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగు చేస్తే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
నెట్‌హౌస్‌ను గుంట భూమి మొదలుకొని 20 గుంటల భూమిలో తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవచ్చు.
ఏర్పాటుకు సుమారు రూ.1.50 లక్షలు ఖర్చవుతుంది. ప్రభుత్వం 50 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. సుమారు 240 నుంచి 400 చదరపు మీటర్ల పరిమాణాల్లో అందుబాటులో ఉంటుంది.
నెట్‌తో బయటి వాతావరణంతో పోలిస్తే లోపలి ఉష్ణోగ్రత 3 నుంచి 5 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తుంది.
గంటకు వంద కి.మీ. వేగంతో వీచే ఈదురు గాలులు, అకాల వర్షాలు, విపరీతమైన ఎండ నుంచి పంటలకు రక్షణ కల్పిస్తుంది.
ఇలా పంటల సాగు ద్వారా 90 శాతం నీరు ఆదా కావడంతో పాటు 5 శాతం వరకు అధిక దిగుబడులు వస్తాయి.
పోర్టబుల్ నెట్‌హౌస్ కింద పంటల సాగుతో పురుగులు, తెగుళ్ల బెడద నుంచి 90 శాతం వరకు తగ్గుతుంది. దీంతో పురుగు మందులకు అయ్యే ఖర్చు రైతులకు తగ్గుతుంది.
ఈ విధానం ద్వారా ఇద్దరు కూలీలతో సులభంగా పంటలు సాగు చేసుకోవచ్చని, రైతుకు నెలకు సుమారు రూ.50వేల వరకు ఆదాయం వస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఆధునిక సాంకేతికతతో సాగులో కొత్త ఒరవడి
నెట్హౌస్తో సరికొత్తప్రయోగానికి శ్రీకారం
ఫరూఖ్‌నగర్ మండలం చించోడ్లో పైలెట్ ప్రాజెక్టు
నీటి పొదుపును ప్రోత్సహించడమే లక్ష్యం
తక్కువ నీటితో పంటల సాగు.. అధిక దిగుబడి


