శంకర్‌పల్లి: పెట్రోల్, డీజిల్, ఇతర కారణాలతో పర్యావరణం కలుషితమవుతోందని, దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శంకర్‌పల్లి రెవెన్యూ పరిధిలోని ఇంద్రారెడ్డి నగర్ సైకిల్ ట్రాక్ వద్ద ఆదివారం హెచ్‌సీఎల్ ఆధ్వర్యంలో సైక్లోథాన్ నిర్వహించారు. కార్యక్రమానికి జయేశ్ రంజన్‌తో పాటు తెలంగాణ సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, సైబరాబాద్ సీపీ రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నాలుగు విభాగాల్లో (ప్రొఫెషన్, అమెచ్యూర్, అమెచ్యూర్ ఎంటీబీ, గ్రీన్ రోడ్ రైడ్) నిర్వహించిన ఈవెంట్‌లో 2,200 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. విజేతలకు రూ. 33.6లక్షల ప్రైజ్ మనీ అందించారు. ఈ సందర్భంగా జయేశ్ రంజన్ మాట్లాడుతూ.. పెట్రోల్, డీజిల్ వాహనాలను ఇష్టారీతిన కాకుండా అవసరం ఉన్నప్పుడే వాడాలని, లేకపోతే సైకిల్ ఉపయోగించాలన్నారు. ఆధునిక కాలంగా ప్రతి ఒక్కరూ నిత్యం గంట పాటు వ్యాయామం చేయాలని, తద్వారా శారీర ధృఢత్వంతో పాటు మానసిక ఆనందం కలుగుతుందన్నారు. ఇలాంటి పోటీలు ఆరోగ్యంతో పాటు క్రీడలు, ఫిట్‌నెస్‌పై ఆసక్తిని పెంచుతాయన్నారు. మల్లారెడ్డి మాట్లాడుతూ.. సైక్లింగ్ అసోసియేషన్ చేపట్టిన కార్యక్రమాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రొ త్సాహిస్తోందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సైబరాబాద్ అదనపు ట్రాఫిక్ డీసీపీ హనుమంతరావు, హెచ్‌సీఎల్ ప్రతినిధి కీర్తి కరంచందిని, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యుడు శైలేంద్ర పాల్గొన్నారు.
అటవీ, పర్యావరణ శాఖప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్
హెచ్‌సీఎల్ ఆధ్వర్యంలో సైక్లోథాన్ కార్యక్రమం
పాల్గొన్న 2,200 మంది ఔత్సాహికులు


