అధ్వానంగా ఎల్లకొండ – పూలపల్లి రోడ్డు
నవాబుపేట: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది మండలంలోని ఎల్లకొండ – పూలపల్లి రోడ్డు పరిస్థితి. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో పనులు ప్రారంభం కాలేదు. దీంతో ప్రజలు, వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని ఎల్లకొండ గేటు నుంచి గొల్లగూడ, గంగ్యాడ, నారెగూడ, పూలపల్లి గేటు వరకు ఉన్న ప్రధాన బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. చాలాకాలంగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. గతంలో కురిసిన భారీ వర్షాలకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ మార్గంలో ప్రయాణం నరకాన్ని తలపిస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు ప్రధాన రోడ్లకు..
వికారాబాద్ వయా నవాబుపేట – ఎల్లకొండ గేటు మీదగా శంకర్పల్లికి ఇదే ప్రధాన రహదారి. మరోవైపు వికారాబాద్ వయా సిద్ధులూరు, పూలపల్లి గే టు మీదుగా చిలుకూరు, హిమాయత్ నగర్‌కు వెళ్లే ప్రధాన రోడ్డు. ఈ రెండు ప్రధాన రహదారులకు లింకు రోడ్డే ఎల్లకొండ గేటు నుంచి పూలపల్లి గేటు వరకు ఉంది. ఈ రోడ్డు మధ్యలో గొల్లగూడ రైల్వే స్టేషన్ ఉంది. చాలా గ్రామాల ప్రజలు ఈ స్టేషన్ రావాలంటే పై రోడ్డు దిక్కు. స్టేషన్ నుంచి వివిధ గ్రామాలకు వెళ్లాలంటే ఇదే ప్రధానం. దీంతో ఈ మార్గంలో ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉంటుంది.
మూడేళ్ల క్రితం రూ.5.75 కోట్లు మంజూరు
ఎల్లకొండ గేటు నుంచి గొల్లగూడ, గంగ్యాడ, నారెగూడ, పూలపల్లి గేటు వరకు రీ బీటీ నిర్మాణం కోసం ప్రభుత్వం 2023లో రూ.5.75 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో గ్రామాల పరిధిలో సీసీ రోడ్లు, రీ బీటీ వేయాల్సి ఉంది. రెండేళ్ల క్రితం ఎల్లకొండ, గంగ్యాడ గ్రామాల్లో సీసీ రోడ్లు వేసి గొల్లగూడ గ్రామంలో వదిలేశారు. రీ బీటీ పనులు మాత్రం ఆగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
15 వీ కే బీ 101
అధ్వానంగా ఎల్లకొండ రోడ్డు
రీ బీటీకి మూడేళ్ల క్రితం నిధుల మంజూరు
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రారంభం కాని పనులు
పట్టించుకోని అధికారులు
ఇబ్బందుల్లో ప్రజలు, వాహనదారులు


