అనంతగిరి: విద్యార్థుల సంక్షేమం, భద్రత, విద్యా అభివృద్ధి, బాలల హక్కుల పరిరక్షణకు అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత సూచించారు. వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాల, వసతి గృహాలను, కుల్కచర్ల మండలం ముజాహిపుర్‌లోని మోడల్ స్కూల్, సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థుల గదులు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీరు, భోజనం, మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తనిఖీల్లో పలు సమస్యలు, లోపాలను గుర్తించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆమె వెంట జిల్లా సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, ఇంచార్జీ డీసీపీఓ శ్రీకాంత్, ఈఓ అంబికా, బాలల పరిక్షణ అధికారులు, చైల్డ్ లైన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
పరిగి: హైదరాబాద్ నుంచి కర్ణాటకకు వెళ్తున్న ఆ రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేను శుక్రవారం పరిగి పట్టణంలో పలు పార్టీల నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులపై ఆరా తీశారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో నాయకులు హన్మంతు ముదిరాజ్, పెంటయ్య, విజయ్‌కుమార్‌రెడ్డి, బంగ్ల యాదయ్య గౌడ్, లింగయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన ముఠాకు వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట పోలీసుస్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) జి. భరత్ భూషణ్ చారి సహకరించినట్లు ఆరోపణలు వెల్లవెత్తాయి. తన ఫోన్‌ను ట్రాక్ చేసి, వ్యక్తిగత సమాచారం, లోకేషన్స్, కదలికలకు సంబంధించిన వివరాలను నిందితులకు చేరవేశారంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదులో సిటీ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ఎస్సై చారితో పాటు ఐదుగురు నిందితుల జాబితాలో ఉన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో బండి రాఘవేంద్ర, బంగ్లా రామానుజేయ, పోశాల శోభన్, మసెట్టి హరిప్రసాద్, అర్జున్‌తో పాటు జి. భరత్ భూషణ్ చారి మరో ముగ్గురి ప్రస్తావన ఉంది.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: రబీ సీజన్‌కు సంబంధించి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశామని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వివిధ జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన కలెక్టరేట్ నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల, జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పనులు వేగ వంతం చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలయ్యేట్లు చూస్తున్నామని తెలిపారు. రబీ సాగు ప్రణాళిక, రాయితీ విత్తనాల పంపిణీ, పంటల వైవిధ్యీకరణతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పన, విద్యార్థుల నమోదు పెంపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిరణ్మయి, డీఆర్‌డీఏ పీడీ శ్రీలత, వ్యవసాయాధికారి సుజాత, డీఈఓ వెంకటేశ్వర్లు, పశుసంవర్ధక శాఖ అధికారి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


