అనంతగిరి: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ సూచించారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని జెడ్పీ నూతన కార్యాలయం నుంచి అధికారుల సేవలు ప్రారంభమయ్యాయి. మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, కలెక్టర్ దీపక్‌తివారి, ఎమ్మెల్యే టీఆర్‌ఆర్, ఎస్పీ స్నేహమెహ్ర తదితరులు జెడ్పీ సీఈఓ సుధీర్‌ను తన చాంబర్‌లో ఆశీనులు గావించారు. అనంతరం రూ.72 లక్షల నిర్మించిన ప్రహరీ, అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన పాలనే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి రావొద్దన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, వికారాబాద్ ఏఎంసీ చైర్మన్ చాపల శ్రీనివాస్ ముదిరాజ్, వైస్ చైర్మన్ మల్లేశం, పీఏసిఎస్ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
స్పీకర్ ప్రసాద్ కుమార్
జెడ్పీ నూతన కార్యాలయం నుంచి సేవలు ప్రారంభం


