కుల్కచర్ల: కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్)లో అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో ఓ మిల్లును అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 2022 – 23 రబీ, 2023 – 24 ఖరీప్ సీజన్లలో ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన వడ్లను మిల్లింగ్ కోసం కుల్కచర్ల మండలం ఘనపూర్ గేటు సమీపంలోని శ్రీ విశాలాక్షి ఇండస్ట్రిస్(రైస్‌మిల్)కు కేటాయించింది. పలుమార్లు సీఎంఆర్‌ను తిరిగి ఇవ్వాలని అధికారులు సూచించారు. స్పందన లేకపోవడంతో 2026 ఆగస్టులో 21న తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేసిన వడ్లకు మిల్లులోని ధాన్యం నిల్వల మధ్య భారీ తేడా ఉన్నట్లు గుర్తించారు. 812.227 క్వింటాళ్ల బియ్యం తక్కువగా ఉన్నట్లు తేలింది. వీటి విలువ రూ.3,36,71,560 ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నరసింహారెడ్డి ఈ నెల 11న మరోమారు రైస్ మిల్లును సందర్శించి కుల్కచర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం సీఐ కొండల్ రెడ్డి మిల్లును సీజ్ చేశారు. ఏ –1గా మగుద రవితేజ, ఏ –2గా బృంగి వేణుగోపాల్, ఏ –3గా మాలెల వెంకటయ్య, ఏ –4గా మాడం వెంకటేశంపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో కుల్కచర్ల ఎస్‌ఐ రమేష్ పాల్గొన్నారు.
రూ.3,36,71,560 విలువ చేసే సీఎంఆర్ మాయం
నిర్వాహకులపై కేసులు


