తాండూరు: కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి జిల్లా అంతటా సాగునీరు అందేలా చూడాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యూ రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యల్ప తలసరి ఆదాయం కలిగిన జిల్లా వికారాబాద్ అన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటడం, బోరుబావులు ఎండిపోవడంతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్నారని పేర్కొన్నారు. సరైన ప్రణాళిక లేకపోవడంతో వర్షపు నీరు వృథాగా దిగువ ప్రాంతాలకు వెళుతోందన్నారు. రిజర్వాయర్లు నిర్మించి కృష్ణా జలాలను జిల్లాకు మళ్లిస్తే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్‌కు భీమా రిజర్వాయర్ నుంచి నీటిని తరలించే ఎత్తిపోతల పథకాన్ని స్వాగతిస్తామని, ఈ పథకం కొడంగల్‌కే పరిమితం కాకుండా తాండూరు, పరిగి, వికారాబాద్ ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. పరిగి ప్రాంత రైతులు రెండు పంటల సాగు చేసుకునేలా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను, తాండూరు ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న శివసాగర్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ నియోజకవర్గంలోని నాగారం వద్ద కాగ్నా నదిపై ప్రాజెక్టుతో పాటు అవరసమైన చోట్ల చిన్న చిన్న చెక్ డ్యాంలు నిర్మించాలని సూచించారు. ఏటా కర్ణాటక వైపు వృథాగా పోతున్న నాలుగు టీఎంసీల నీటిని ఒడిసి పట్టి జిల్లాలోని చెరువులను నింపాలన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో జిల్లాకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఈ సమస్యపై స్పందించకపోవడం విచారకరమన్నారు. రైతు అవసరాల కంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ఆసక్తి చూపుతున్న ప్రజాప్రతినిధులు అభివృద్ధి, వ్యవసాయ రంగంపై దృష్టి సారించాలని హితవు పలికారు. కార్యక్రమంలో పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, నాయకులు భధ్రేశ్వర్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అంతటా సాగునీరు అందేలా చూడాలి
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రమేష్‌కుమార్


