హయత్‌నగర్: ఆ క్రీడ అంటే అంతగా ఎవరికీ పరిచయం లేదు.. చాలామంది చూసి కూడా ఉండరు.. కాని ఆ క్రీడనే కెరీర్‌గా ఎంచుకుంది ఆ బాలిక. వ్యవసాయ కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఢిల్లీ స్థాయికి ఎదిగింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తొర్రూర్ గ్రామానికి చెందిన ఆనపగంటి కృష్ణగౌడ్, రాధ దంపతులు. వారికి ముగ్గురు సంతానం. రెండో కూతురు ఐశ్వర్య తొర్రూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతూ క్రీడలపై ఆసక్తిని పెంచుకుంది. పీఈటీ ప్రోత్సాహంతో రగ్బీ ఆటను ఎంచుకుని అందులో శిక్షణ తీసుకుంది. రెండేళ్ల శిక్షణ అనంతరం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించింది. డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వారు ఈ నెల 5 నుంచి 8వరకు ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ స్కూల్ గేమ్స్‌లో తెలంగాణ తరుఫున పాల్గొని సత్తా చాటింది. క్రీడలతో పాటు చదువులోనూ చురుగ్గా ఉండే ఆమె ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని, క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడి దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది.


